మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 03:23:06

ఆధారాల సేకరణలో సీఐడీ

ఆధారాల సేకరణలో సీఐడీ

  • శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో కొనసాగిన దర్యాప్తు 
  • రంగంలోకి దిగిన ఫోరెన్సిక్‌, క్లూస్‌ బృందాలు 
  • అణువణువూ పరిశీలించి ఆధారాల సేకరణ
  • సేకరించిన వస్తువులు ఫోరెన్సిక్‌ పరీక్షలకు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ శ్రీశైలం: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నది. గురువారం అర్ధరాత్రి జలవిద్యుత్‌ కేంద్రంలో ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయమే ఘటనా స్థలంలో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అడిషనల్‌ డీజీ గోవింద్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం ఆదివారం కూడా విచారణ కొనసాగించింది. ఒక అడిషనల్‌ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలతోపాటు క్లూస్‌టీం సభ్యులు శనివారం ఉదయం 8 గంటలకు పీఏటీ టన్నెల్‌ వద్దకు చేరుకుని అధికారులతో సమీక్షించారు. 10 గంటలకు విద్యుత్‌ ప్లాంట్‌లోకి వెళ్లిన బృందం సభ్యులు మధ్యా హ్నం 2 గంటల వరకు బ్యాటరీ రూం, పీఎల్‌సీ రూం, ఎంసీఆర్‌, అన్ని జనరేషన్‌ యూనిట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నాలుగవ, ఆరవ యూ నిట్ల వద్ద పేలుడు కారణంగా ఎక్కువగా ధ్వంసమైన తీరును తెలుసుకున్నారు. సర్వీస్‌బే నుంచి కిందకు వెళ్లేందుకు క్లూస్‌టీం బృందం ప్రయత్నించగా.. మూడోఅంతస్తు వరకు నీరు చేరుకోవడంతో ఫలితం లేకపోయింది. దీంతో ఘటనాస్థలంలో మాత్రమే ఆధారాలు సేకరించినట్టు తెలుస్తున్నది. ఘటనా స్థలంలో వస్తువులను సేకరించి వాటన్నింటినీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నట్టు దర్యాప్తు బృందంలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్లాంట్‌ ప్రారంభమైన 2001 నుంచి ఇప్పటిదాకా మిషనరీలో ఏవైనా లోపాలు తలెత్తాయా? అనే అంశాలను విశ్లేషించడంలో విద్యు త్‌ కేంద్రం అధికారులు దర్యాప్తు బృందానికి సహకారం అందిస్తున్నారు. ప్రమాదం సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది స్టేట్‌మెంట్లను అధికారులు రికార్డు చేస్తున్నట్టు తెలిసింది. సైబర్‌ క్రైం బృందం సైతం ప్లాంట్‌లో కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను సేకరించినట్టు తెలిసింది. ప్రమాదంపై శాస్త్రీయంగా దర్యాప్తు చేయాల్సి ఉన్నదని, పూర్తి ఆధారాల విశ్లేషణ తర్వాతే ఓ అంచనాకు రాగలుతామని ఉన్నతాధికారి తెలిపారు. ఆధారాల సేకరణకు మరో రెండ్రోజులు పడుతుందని చెప్పారు.


logo