మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 01:15:36

ప్రైవేటుకు చుక్‌చుక్‌ రైలు

ప్రైవేటుకు చుక్‌చుక్‌ రైలు

  • లాభాలు వచ్చే రూట్లు ప్రైవేటుపరం
  • 2.50 లక్షల ఉద్యోగాల భర్తీ నిలిపివేత
  • మధ్యతరగతికి రైలు ప్రయాణం భారమే
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దూర ప్రాంతాలకు తక్కువ ధరకు, భద్రతతో కూడుకున్న ప్రయాణమంటే ఠక్కున గుర్తుకొచ్చేది రైలు. శతాబ్దానికిపైగా చరిత్ర ఉన్న రైల్వే క్రమంగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్తున్నది. ఇప్పటివరకు పేద, మధ్య తరగతి వర్గాలకు అనుకూలంగా ఉన్న రైలు ప్రయాణం ఇకపై భారంగా మారనున్నది. ఇప్పటికే తేజస్‌ పేరుతో రెండు రూట్లలో ప్రైవేటు రైళ్లు ప్రారంభంకాగా మరికొన్ని రూట్లలో ప్రైవేటు రైళ్లు రానున్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా దాదాపు 2.50 లక్షల రెగ్యులర్‌ ఉద్యోగాల భర్తీని ఎప్పుడో నిలిపివేసింది. రద్దీగా ఉండే రూట్లనే ప్రైవేట్‌పరం చేస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే భూములను 99 ఏండ్లకు లీజుకిస్తున్నది. తేజస్‌ మాదిరిగా డైనమిక్‌ టికెట్ల ధరల విధానాన్ని అమలుచేస్తే ఒక దశలో విమానంలో ప్రయాణించడమే మేలన్నంతగా రైలు టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

లాభాలున్న రూట్లు ప్రైవేటు పరం..

దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటుచేసి 109 మార్గాలను ప్రైవేటుపరం చేయడానికి రైల్వేబోర్డు టెండర్లను పిలిచింది. ఈ రూట్లలో 150 రైళ్లను నడపనున్నారు. లాభాలు వచ్చే రూట్లను ప్రైవేటుపరం చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణలో పరిధిలోని సికింద్రాబాద్‌ నుంచి శ్రీకాకుళం, గుంటూరు, తిరుపతి, ముంబై, హౌరా రూట్లలో ప్రైవేటు రైళ్లను నడపటానికి టెండర్లను పిలిచారు. తొలి ప్రైవేటు రైలు 2023 మొదటి భాగంలో వచ్చే అవకాశమున్నది. ఇప్పటికే ప్రైవేట్‌రంగంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ముంబై- అహ్మదాబాద్‌, ఢిల్లీ-లక్నో మధ్యలో నడిపిస్తున్నారు. సికింద్రాబాద్‌ మెట్టుగూడ రైల్‌కళారంగ్‌ సమీపంలోని అత్యంత విలువైన భూమిని ప్రైవేటు సంస్థకు 99 ఏండ్లకు లీజుకిచ్చారు. ట్రాయ్‌ తరహాలో ప్రైవేటు రైళ్ల టికెట్ల ధరలను నిర్ణయించడానికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటుచేశారు. దేశవ్యాప్తంగా రైల్వేలో నాన్‌ సేఫ్టీ విభాగంలో 2.50 లక్షల రెగ్యులర్‌ ఉద్యోగాల భర్తీని నిలిపివేసింది. 

ప్రయాణికులపై భారం..

కేంద్ర ప్రభుత్వం రైల్వేల ద్వారా దాదాపుగా 295 రకాల రాయితీలను అందిస్తున్నది. స్టూడెంట్స్‌, ఎంప్లాయీస్‌, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, క్రీడాకారులు, రైల్వే ఉద్యోగులు ఇలా అనేక మందికి రాయితీలు ఇస్తున్నారు. ప్రైవేటు రైళ్లు అందుబాటులోకి వస్తే ఇవి ఉండవు. ఇప్పటికే ప్రవేశపెట్టిన తేజస్‌ రైళ్లలో డైనమిక్‌ టికెట్‌ ధరలను అమలుచేస్తున్నారు. ప్రారంభంలో 10% టికెట్లను తక్కువకు, ఆ తర్వాత విక్రయించే టికెట్ల ధరలను క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. దీంతో చివరగా విక్రయించే టికెట్లు విమాన టికెట్ల ధరలతో సమానంగా ఉంటున్నాయి. ఇక రాబోయే ప్రైవేటు రైళ్లలోనే ఇదే పరిస్థితి. ప్రస్తుతం 109 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను అనుమతించగా అవి వచ్చిన తరువాత ఆ రూట్లలో రైల్వే నడిపించే రైళ్లను క్రమంగా తగ్గిస్తారు. దీంతో ప్రయాణికులు ప్రైవేటు రైళ్లను ఆశ్రయించక తప్పదు. రైల్వే రూట్లను ప్రైవేట్‌పరం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అటు కార్మికులు, ఇటు ప్రయాణికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు.


logo