సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 11:43:51

రాష్ట్రంలో ఘనంగా క్రిస్మ‌స్‌ వేడుకలు

రాష్ట్రంలో ఘనంగా క్రిస్మ‌స్‌ వేడుకలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో క్రిస్మ‌స్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచే చర్చిల్లో క్రిస్మ‌స్‌ సందడి నెలకొన్నది. నగరంలోని సికింద్రాబాద్‌లోని సెయింట్‌మేరీ, వెస్లీ చర్చిల్లో వేకువజాము నుంచే క్రిస్‌మస్‌  సంబురాలు నిర్వహిస్తున్నారు. ఏకుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. కేక్‌ కట్‌ చేసి పండుగను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.  


ఏసుక్రీస్తు పుట్టినరోజుకు గుర్తుగా జరుపుకునే క్రిస్మ‌స్‌ పండుగ సందర్భంగా రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన మెదక్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అర్ధరాత్రి నుంచే పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. చర్చి పాస్టర్‌ సాల్‌మాన్‌ రాజు ఆరాధన ఏసు సందేశాలు అందిస్తున్నారు. అదేవిధంగా వరంగల్‌, సంగారెడ్డి, గజ్వేల్‌ పట్టణంలోని బాలయేసు పుణ్యక్షేత్రంలో, జహీరాబాద్‌ చర్చిల్లోనూ క్రైస్తువులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.  


ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. చర్చి పాస్టర్‌తో కలిసి క్రిస్మ‌స్‌ కేక్‌ కట్‌చేసి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.