మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 17:22:47

కరుణకు ప్రతి రూపమే క్రైస్తవం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కరుణకు ప్రతి రూపమే క్రైస్తవం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్ : ప్రేమ, శాంతి , కరుణ, దయలకు ప్రతిరూపమే క్రైస్తవమని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సేవ చేయడమే పరమావధిగా అనేకమంది క్రైస్తవులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గత మార్చిలో వచ్చిన కరోనా సమయంలో కూడా అనేక మంది క్రిస్టియన్ సోదర, సోదరీమణులు ఎంతో మందికి సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తు చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అదేవిధంగా పదిమందిని ఆదుకోవాలనే ఆలోచన, ప్రతి మనిషికి సేవ చేయాలనే తపన క్రైస్తవ మతంలో ఉందన్నారు. 

క్రిస్మస్‌ను పురస్కరించుకొని శుక్రవారం మంత్రి జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి, క్రిస్టియన్ పల్లి, మోతీ నగర్‌లో ఉన్న చర్చీల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు ప్రబోధించిన శాంతి మార్గంలో పయనించాలని, శాంతిని, గొప్ప  ప్రవచనాలను క్రైస్తవం ప్రభోదిస్తుందని ఆయన గుర్తు చేశారు. డాక్టర్లు, నర్సులుగా అనాథ శరణాలయాలు నిర్వహిస్తూ సేవా రంగాలలో అనేక మంది  క్రిస్టియన్లు ముందుకు సాగుతున్నారన్నారు.


ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడవాలని, హింసా మార్గాన్ని విడవాలన్నారు. మహబూబ్ నగర్‌లో కోటి రూపాయల వ్యయంతో క్రైస్తవ భవన్ నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని క్రైస్తవులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఎంబీసీ చర్చిలో నిర్వహించిన ప్రార్థనల్లో రెవరెండ్ వరప్రసాద్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, చర్చి ఫాదర్లు, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.