గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 03:06:23

వృక్షాలే ఊపిరితిత్తులు

వృక్షాలే ఊపిరితిత్తులు

  • గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ అద్భుతం: చిరంజీవి 
  • గ్రీన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన చిరు, పవన్‌కల్యాణ్‌
  • అభిమానులూ మొక్కలు నాటాలని పిలుపు

హైదరాబాద్‌/ బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మూడేండ్లుగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ నిజమైన హీరో అని ప్రముఖనటుడు చిరంజీవి కొనియాడారు. ఈ కార్యక్రమం మహాద్భుతంగా సాగుతున్నదని ప్రశంసించారు. గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ, జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఎన్టీవీ చైర్మన్‌ నరేంద్రచౌదరి నాయకత్వంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌.. ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే భూతల్లికి ప్రతి పౌరుడిచ్చే గొప్ప బహుమతి అన్నారు. కరోనా వైరస్‌ వల్ల మానవ శరీరంలో మొదటగా దెబ్బతినేది ఊపిరితిత్తులని, కరోనా వేళ సామాన్యులకు కూడా ప్రాణవాయువు విలువ తెలిసిందని చెప్పారు. ఈ భూమి తల్లికి అడవులు, వృక్షాలు ప్రాణవాయువు అందిస్తాయని, భూమికి ఊపిరితిత్తులు చెట్లు అని, అలాంటి ప్రాణవాయువుని అందించే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. గ్రీన్‌చాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని  తన అభిమానులందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 

పచ్చదనం లేకుంటే కష్టం

జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్‌ సహకారంతో మొక్కలునాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు హీరో పవన్‌కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. పచ్చదనం లేకుంటే చాలాకష్టమని, దుబాయ్‌ వంటి దేశంలో పచ్చదనం కోసం చాలా కష్టపడుతారని చెప్పారు. తానూ ప్రకృతి ప్రేమికుడినని, మొక్కలు నాటడం తనకు చాలా ఇష్టమని, గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమంలో భాగస్వామిని కావడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో  సినీ దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్‌ రావిపూడి, జూబ్లీహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ  కార్యదర్శి హనుమంతరావు, జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ అధ్యక్షుడు చలసాని దుర్గాప్రసాద్‌, కార్యదర్శి సురేశ్‌రెడ్డి, సభ్యులు చలసాని శ్రీనివాస్‌, విద్యాసాగర్‌, బాలకృష్ణ, అట్లూరి సుబ్బారావు మొక్కలు నాటారు.

నానక్‌రాంగూడలో ‘మా’ అధ్యక్షుడి గ్రీన్‌చాలెంజ్‌

గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా సినీ దర్శకుడు సతీశ్‌ వేగ్నేశ విసిరిన చాలెంజ్‌ను మా అధ్యక్షుడు నరేశ్‌ స్వీకరించారు. నానక్‌రాంగూడలోని తన నివాస ప్రాం గణంలో మొక్కలు నాటారు. 

తాజావార్తలు


logo