మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 02:49:32

హైదరాబాద్‌ సినిమా సిటీ

హైదరాబాద్‌ సినిమా సిటీ

  • అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం
  • నగర శివారులో 1500-2000 ఎకరాల స్థలం
  • బల్గేరియా సినిమా సిటీ పరిశీలనకు అధికారుల బృందం
  • షూటింగులు, థియేటర్ల ప్రారంభానికి పచ్చ జెండా
  • సీఎం కేసీఆర్‌ ప్రకటన
  • కేసీఆర్‌ను కలిసిన సినీ నటులు చిరంజీవి, నాగార్జున

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తున్నది. భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు ఫిల్మ్‌ సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ను నిర్మించనున్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్‌ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమాసిటీని పరిశీలించి రావాలని సూచించారు. 

ఆ తరువాత ‘సినిమా సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌' నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనందున సినిమా షూటింగులు, థియేటర్లు పునఃప్రారంభించవచ్చని సీఎం ప్రకటించారు. సినీరంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి - విస్తరణపై చర్చ జరిగింది. వారినుద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో చిత్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో అటు షూటింగులు ఆగిపోయి, ఇటు థియేటర్లు నడువక అనేకమంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.


లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ పరిస్థితులు

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.88 శాతం ఉన్నదని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభించాలని, థియేటర్లు కూడా ఓపెన్‌ చేయాలని సూచించారు. తద్వారా చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలను కష్టాల నుంచి బయట పడేయటం సాధ్యమవుతుందన్నారు. ‘హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి- విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. హైదరాబాద్‌ కాస్మోపాలిటన్‌ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు, వివిధ భాషలకు చెందినవారు ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌కు ఎవరినైనా ఒడిలో చేర్చుకునే గుణం ఉంది. షూటింగులతో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను చాలా సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలున్నది. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం ‘సినిమా సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌' నిర్మించాలనే తలంపుతో ఉంది. ఇందుకోసం ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది.


 అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియో లు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తుంది. ఎయిర్‌ స్ట్రిప్‌తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వ అనుమతులతో షూటింగులు ప్రారంభించామని, త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చిరంజీవి, నాగార్జున ముఖ్యమంత్రికి చెప్పారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు జే సంతోష్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ముఖ్యకార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, శేషాద్రి పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి- విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. షూటింగులతోసహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలున్నది. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ప్రభుత్వం ‘సినిమా సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌' నిర్మించాలనే తలంపుతో ఉంది. ఇందుకోసం ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తుంది. అందులో అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తున్నది.            

-సీఎం కేసీఆర్‌