శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 00:37:48

దేవా.. కరుణించవయా

దేవా.. కరుణించవయా

  • ఆలయాల్లో మృత్యుం జయ హోమం 
  • ముచ్చింతల్‌లో చినజీయర్‌స్వామి శ్రీవిష్ణు సహస్ర పారాయణం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని వేడుకుంటూ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో అర్చకులు హోమాలు నిర్వహించారు. మంగళవారం సికింద్రాబాద్‌ గణపతి దేవాలయం, మెదక్‌ జిల్లా ఏడుపాయల దుర్గాభవాని ఆలయం, జోగుళాంబ అలంపూర్‌ దేవాలయంలో మృత్యుంజయ హో మం చేశారు. కరోనా నామకభయ నివారణ మహామృత్యుంజయ పాశుపథ హోమం, రుద్రహోమాన్ని అలంపూర్‌లో నిర్వహించారు.  

శ్రీవిష్ణు సహస్ర పారాయణంలో చినజీయర్‌స్వామి

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఉన్న దివ్యసాకేత క్షేత్రంలో మంగళవారం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ కొవిడ్‌-19 నివారణకు శ్రీవిష్ణు సహస్ర పారాయణాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ చినజీయర్‌ స్వామి ప్రారంభించారు.

ఇంట్లోనే ఉగాది ఉత్సవాలు

తెలుగు రాష్ర్టాల్లోని ప్రజలంతా బుధవారం ఉగాది పర్వదినాన్ని ఇండ్లలోనే జరుపుకోవాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలకు శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎవరూ బయటికి రావద్దని కోరుతూ..  దారుణమైన విపత్తు తొలగిపోవాలని దేవుడిని ప్రార్థించాలని చెప్పారు. 

దుర్గా పరమేశ్వరి స్తోత్రం పఠించండి

- శృంగేరి శంకరాచార్యులు భారతీతీర్థ మహాస్వామి  


కరోనా వైరస్‌ బారి నుంచి సమాజాన్ని కాపాడటానికి ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని శృంగేరి శంకరాచార్యులు భారతీతీర్థ మహాస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ వీలైనన్నిసార్లు దుర్గాపరమేశ్వరి స్తోత్రాన్ని పఠించాలని సూచించారు. సమస్త మానవాళి క్షేమం కోసం ఈ మంత్ర పఠనం ఆవశ్యకమన్నారు. అలాగే, నారాయణ, మన్యుసూక్తం, రుద్రం, హనుమాన్‌ చాలీసా పారాయణాలను విరివిగా చేద్దామని మాధవానంద సరస్వతిస్వామి సూచించారు.


logo