శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:32:58

సరిహద్దులో చైనాతో శాంతికి బాటలు

సరిహద్దులో చైనాతో శాంతికి బాటలు

ఏ సమస్యను ఎలా వాయిదా వేయాలో, ఎలా పరిష్కరించాలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు బాగా తెలుసు. సమయం, సందర్భాన్ని బట్టి పావులు కదుపుతూ తన మార్కు చూపించేవారు. ఇలాంటివి ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కశ్మీర్‌ అంశం అలాంటిదే. ఆ తర్వాత 1993 భారత్‌- చైనా శాంతి ఒప్పందంలో పీవీ చొరవను శ్లాఘించాల్సిందే. భారత్‌కు చైనాతో 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది. దీనిని తూర్పు, మధ్య, పశ్చిమ మూడు విభాగాలుగా విభజించారు. సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ తూర్పు సరిహద్దులో, మధ్య విభాగంలో హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ విభాగంలో లడఖ్‌ వస్తుంది. లడఖ్‌లో చైనాతో 1,597 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది. ఈ ప్రాంతంలోని ప్రదేశాలు తమ దేశానికి చెందినవని 1957లోనే చైనా కొర్రీ పెట్టింది.

అలా మొదలైన సరిహద్దు సమస్య నేటికీ కొనసాగుతున్నది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని తలచిన పీవీ.. వాస్తవాధీన రేఖపై చైనాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. స్వయంగా తానే చైనాకు వెళ్లి అప్పటి ఆ దేశ ప్రధాని లీ పెంగ్‌తో భారత్‌-చైనా వాస్తవాధీన రేఖ వద్ద శాంతికి ‘బోర్డర్‌ పీస్‌ అండ్‌ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్‌' చేసుకొచ్చారు. ఈ ఒప్పందం 1993 సెప్టెంబర్‌ 7వ తేదీన జరిగింది. ‘వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాలు భారీగా మోహరించిన దళాలను ఉన్నపళంగా తగ్గించాలి. తక్కువ సంఖ్యలో ఉన్నా సైనికులు పరస్పరం సత్సంబంధాలను కలిగి ఉండాలి. ఏదేని సందర్భంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటే ఇరువర్గాలు కలిసి చర్చించుకొని సమస్యకు పరిష్కారం కనుగొనాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాస్తవాధీన రేఖను దాటొద్దు. సైనిక విన్యాసాలు చేయాల్సి వస్తే ముందుగానే నోటిఫికేషన్‌ ఇవ్వాలి. వైమానిక దళ విన్యాసాలు కూడా నిబంధలకు లోబడే చేసుకోవాలి’ అని రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.

ఆ ఒప్పందం ప్రకారం ఎల్‌ఏసీ వెంబడి సైనిక బలగాలను తక్కువ స్థాయిలో మోహరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. అప్పటి నుంచి గల్వాన్‌ ఘటనకు ముందు వరకు వాస్తవాధీన రేఖ వద్ద తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకోలేదు. గల్వాన్‌ ఘటన సందర్భంగా చైనా సైనికులు ఆ ఒప్పందానికి తూట్లు పొడిచారు. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల పాటు వాస్తవాధీన రేఖ వద్ద శాంతి నెలకొంది. ఇదంతా పీవీ వేసిన ముందడుగు ఫలితమే.logo