బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 15:17:00

ఎంఐఎం నాయ‌కుడి ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించిన చిలుకూరి పూజారి

ఎంఐఎం నాయ‌కుడి ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించిన చిలుకూరి పూజారి

హైద‌రాబాద్ : బ‌క్రీద్ ప‌ర్వదినం నాడు ముస్లింలు ఆవుల‌ను బ‌లి ఇవ్వొద్ద‌ని క‌రీంన‌గ‌ర్ ఎంఐఎం నాయ‌కుడు గులాం అహ్మ‌ద్ హుస్సేన్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను హృద‌య‌పూర్వ‌కంగా స్వాగ‌తిస్తున్న‌ట్లు చిలుకూరు బాలాజీ ఆల‌య‌ అర్చ‌కులు సి.ఎస్‌. రంగ‌రాజ‌న్ తెలిపారు. అదేవిధంగా ఇత‌ర ముస్లిం మ‌త పెద్ద‌లు కూడా ఇదే విధంగా ప్ర‌క‌ట‌న‌లు చేయాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు చెప్పారు. ఇటువంటి ప్ర‌క‌ట‌న‌లే ప్ర‌తీ ఏడాది బ‌క్రీద్ కంటే ముందే చేయ‌వ‌లసి ఉంద‌న్నారు. ఎందుకంటే ఒక్క రోజే ల‌క్ష‌లాది ఆవులు, దూడ‌లు బ‌లి ఇవ్వ‌డం హిందువుల్లో గొప్ప వేద‌న‌కు దారితీస్తుంద‌న్నారు. స‌మాజాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు పెరుగుతాయ‌న్నారు. కాగా ఇటువంటి ప్ర‌క‌ట‌న‌లు మ‌తాల మ‌ధ్య సామ‌ర‌స్యాన్ని బ‌లంగా ఏర్ప‌రుస్తాయ‌న్నారు.  

బ‌క్రీద్ మాసంలో అదేవిధంగా బక్రీద్ ప‌ర్వ‌దినం నాడు ఆవుల‌ను బ‌లి ఇవ్వ‌వ‌ద్ద‌ని ఎఐఎంఐఎం నాయ‌కుడు, క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు గులాం అహ్మ‌ద్ హుస్సేన్ ముస్లి స‌మాజాన్ని కోరారు. జాతీయ సమగ్రత కోసం ప్రభుత్వం ఆవు బలిని నిషేధించింద‌న్నారు. మ‌నమంతా ప్రభుత్వ చర్యలు, నియమాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఇస్లాం ప్రకారం ఏ కార్యక్రమం సమాజంలోని ఇతర వ్యక్తులను బాధించకూడదని ఆయన అన్నారు. మ‌హ్మ‌ద్ ప్రవక్త కూడా ఇదే చెప్పారన్నారు. మ‌త సంప్ర‌దాయాలు, సంస్కృతిని పాటించే ప్ర‌తీ ముస్లిం ఇస్లాంకు వ్య‌తిరేకంగా వెళ్ల‌వ‌ద్ద‌న్నారు. 

కోవిడ్ -19 వ్యాప్తి దృష్ట్యా ముస్లింలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ప్రభుత్వ నియ‌మాల‌ను ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం, 1897 ప్రకారం చర్యల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌న్నారు. పశువుల మార్కెట్లలో ఆవుల అమ్మకాలను ఆపడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, పోలీసు కమిష‌న‌ర్ ను కోరారు. భౌతిక దూరం పాటిస్తూ బ‌క్రీద్ జ‌రుపుకోవాల‌ని ముస్లిం స‌మాజానికి పిలుపునిచ్చారు. గులాం అహ్మ‌ద్ హుస్సేన్  ప్రకటనను చిలుకూరు బాలాజీ ఆల‌యంతో పాటు ప‌లు హిందూ మత సంఘాలు స్వాగతించాయి.


logo