సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:20:46

స్మార్ట్‌.. వ్యసనం కావొద్దు

స్మార్ట్‌.. వ్యసనం కావొద్దు

 • ఇంటర్నెట్‌ వాడకుండా షరతు పెట్టాలి
 • ఢిల్లీలో ఐదువేల మందికి డిజిటల్‌ క్వారంటైన్‌   
 • సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ మహమ్మారి ప్రపంచగతిని మార్చేసింది. ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట అన్ని వయస్సుల పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు వాడుతున్నారు. ఇది వ్యసనంగా మారే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎనిమిదేండ్లలోపు పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ మొబైల్‌ ఇవ్వవద్దని సూచిస్తున్నారు. ఎనిమిది నుంచి పదేండ్లలోపు వారికి రోజుకు కేవలం అర్ధగంట మాత్రం ఇవ్వవచ్చని చెప్తున్నారు. ‘చిన్నారులు టెక్నాలజీకి బానిసలుగా మారుతున్నారు’.. అనే అంశంపై మహిళా భద్రతా విభాగం బుధవారం నిర్వహించిన వెబినార్‌లో సైబర్‌ సెక్యురిటీ నిపుణురాలు జూహికౌల్‌ పలు అంశాలను వివరించారు. ఢిల్లీలోని 18 వరకు పాఠశాలల్లో దాదాపు 5 వేల మందికి ఇప్పటికే ఈ అంశంపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. పిల్లలను మొబైల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వ్యసనం నుంచి బయటికి తెచ్చేందుకు వారిని రెండువారాలపాటు డిజిటల్‌ క్వారంటైన్‌ (మొబైల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ వంటి ఏ వస్తువు ఇవ్వకుండా) చేసినట్టు తెలిపారు.

ఇలా అయితే వ్యసనం..

 • రోజులో నాలుగు గంటలకే కన్నా ఎక్కువ సమయం సోషల్‌ మీడియా సైట్లలో గడపడం.  
 • తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులతో సరిగా మాట్లాడకపోవడం.. ముక్తసరి సమాధాలు ఇవ్వడం. 
 • మొబైల్‌తో, ల్యాప్‌టాప్‌తోనే గంటలకొద్దీ గడపడం 
 • పది నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఫోన్‌ వదిలి ఉండలేకపోతున్నట్టయితే అదో పెద్ద హెచ్చరిక.
 • నిద్రపట్టకపోవడం, కండ్లకింద మచ్చలు రావడం.. తలనొప్పి రావడం.
 • ఫోన్‌ వాడవద్దని వారిస్తే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కోపగించుకోవడం.

బయటపడాలంటే..

 • పిల్లలకు ఫోన్లు, ట్యాబ్స్‌, ల్యాప్‌టాప్‌ వాడకానికి రోజుకు కొంత సమయమనే నిబంధన పెట్టాలి. 
 • ఇతర కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసేలా, ఇంటి పనుల్లో వారి బాధ్యత పెంచేలా చూడాలి. 
 • రోజులో గంటపాటు శారీరక శ్రమ కల్పించాలి. 
 • వారాంతాల్లో ఎలాంటి గ్యాడ్జెట్లు పూర్తిగా వాడకుండా ఇతర వ్యాపకాలవైపు దృష్టి మళ్లించాలి.


logo