మంగళవారం 19 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 01:47:42

యూపీ పాలన చేతగాని యోగీ నీతులా!

యూపీ పాలన చేతగాని యోగీ నీతులా!

  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉత్తరప్రదేశ్‌ను సరిగా పాలించడం చేతగాని ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్‌ ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. మతం కోణంలో ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సాధారణ సమయాల్లో కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారని, ఇప్పుడు ఎన్నికలు రావడంతో విమర్శిస్తున్నారని గుర్తుచేశారు. రెచ్చగొట్టే వారిని ప్రజలు ఓటుతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, మహానగరాల విషయంలో సీఎం కేసీఆర్‌ స్పష్టమైన విజన్‌తో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌ సహా మహా నగరాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రణాళిక వివరించినా ప్రధాని మోదీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అగ్రభాగాన ఉంచేందుకు శ్రమిస్తున్న టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. హైదరాబాద్‌లో గత ఆరేండ్లలోనే ఒక్కసారి కూడా లాఠీచార్జి జరుగలేదని గుర్తుచేశారు. యువత ఆవేశానికి లోను కాకుండా అభివృద్ధి కోణంలో ఆలోచించాలని సూచించారు. మంత్రి కేటీఆర్‌ అద్భుతంగా పనిచేస్తున్నారని, ఆయన విజన్‌ను చూసి ఓటేయ్యాలని కోరారు. నగర అభివృద్ధి ప్రణాళికను మ్యానిఫెస్టోలో స్పష్టంగా చెప్పామని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సంబంధంలేని విషయాలు వివరించాయని ధ్వజమెత్తారు. ప్రధాని వస్తే హైదరాబాద్‌కు ఏదైనా ప్యాకేజీ ప్రకటిస్తారని ఆశించారని, కానీ అది జరుగలేదని ఆయన అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.