e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home తెలంగాణ తండాలకు మహర్దశ

తండాలకు మహర్దశ

తండాలకు మహర్దశ
  • ఉమ్మడి పాలనలో ఆకలికి చిరునామా
  • పేదరికం, నిరక్షరాస్యతతో కన్నబిడ్డలనే అమ్ముకున్న వైనం
  • స్వరాష్ట్రంలో తండాల రాతమార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం
  • పంచాయతీగా గుర్తింపుతో మారిన దశ
  • స్వయంపాలనతో అభివృద్ధిలో దూకుడు
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో చైతన్యం

ఎక్కడో విసిరేసిట్టు అడవులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు. వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే జీవనం.. తాగటానికి సరిపడా నీరు దొరకదు.. కడుపు నిండా తిండి ఉండదు. వేరే ఊరికి వెళ్లాలంటే కిలోమీటర్లకొద్దీ చెమటలు కక్కుతూ నడవాలి. ఇదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని గిరిజన తండాల జీవన చిత్రం.. కానీ నేడు వాటి రూపమే మారిపోయింది. తండాలు స్వయం పాలనకు వేదికలయ్యాయి. ప్రతి ఇంటినీ మిషన్‌ భగీరథ పలకరిస్తున్నది. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు.. మరుగుదొడ్డి.. ఊరి బయట పల్లె ప్రకృతి వనాలు, డంప్‌యార్డు, వైకుంఠథామం. వీటన్నింటికీ మించి పొట్టచేతపట్టుకొని దేశదేశాలూ వసల పోయే బాధలకు ముగింపు పలికాయి తండాలు.. కలలో కూడా ఊహించి ఈ మార్పు వెనుక ఉన్నది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.

మహబూబ్‌నగర్‌, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తండాలు కళకళడుతున్నాయి. ఏనాడూ చూడని సింగారాలు సంతరించుకొని స్వయంపాలనతో ప్రగతి పథాన దూసుకుపోతున్నాయి. తండాల్లో నేడు గిరిజన బిడ్డలే పాలకులు.. వాళ్లే పాలితులు. 2008 ఏప్రిల్‌ 11న నాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ఒక ప్రతిజ్ఞ ఫలితం నేడు ప్రతి లంబాడా తండాలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. ఒకనాడు ప్రధాన గ్రామ పంచాయతీకి అనుబంధ పల్లెలుగా ఉండి.. తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తండాలు, నేడు సకల సౌకర్యాలతో గ్రామపంచాయతీలుగా వర్ధిల్లుతున్నాయి. గిరిజనులను అన్నిరంగాల్లో అభివృద్ధి పథకంలోకి తీసుకురావాలంటే ముందుగా వారికి స్వయం పాలనను అలవాటుచేయాలన్న సీఎం కేసీఆర్‌ సంస్కరణాభిలాషను ఇప్పుడు ప్రపంచం ప్రత్యక్షంగా చూస్తున్నది.

ఉద్యమ ప్రతిజ్ఞ..

- Advertisement -

ఏప్రిల్‌ 11, 2008.. స్థలం.. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం నేలబండ (వాల్యానాయక్‌) తండా. సందర్భం.. తెలంగాణ ఆత్మ గౌరవ రథ యాత్రలో భాగంగా అప్పటి ఉద్యమ నేత కేసీఆర్‌ పల్లెనిద్ర. మరుసటి రోజు ఉదయమే వేపపుల్లతో బ్రష్‌ చేస్తూ తండా అంతా కలియతిరిగారు. తండాల్లో ఉపాధి లేక వలసపోయినవారి గురించి విని ఆవేదన చెందారు. కుటుంబాలను వదిలి ముంబై పోయి బతికేటోళ్ల దీనగాథలు ఆయన్ను కదిలించాయి. తండాల్లో రాజ్యమేలుతున్న సమస్యల గురించి కేసీఆర్‌కు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గిరిజన నాయకుడు వాల్యానాయక్‌ వివరించారు. ‘అపన్‌ తండేమ అపనో రాజ్‌’ పేరిట మన తండాలో మన రాజ్యం రావాలని కోరిన గిరిజనులకు అప్పుడే కేసీఆర్‌ అభయమిచ్చారు. మనకు ప్రత్యేక రాష్ట్రం ఎంత ముఖ్యమో తండాలకు ప్రత్యేక గ్రామ పంచాయతీ కూడా అంతే ముఖ్యమని స్పష్టంచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మారుస్తామని స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇచ్చిన హామీ మేరకు తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి.

తండాలకు మహర్దశ

పాలమూరులో వికసిస్తున్న తండాలు..

ఉమ్మడి రాష్ట్రంలో వలసలకు, ఆకలికి, దుర్భిక్షానికి చిరునామా నిలిచిన పాలమూరు జిల్లాల్లో ఇప్పుడు గిరిజన తండాలు అద్భుత ప్రగతి సాధిస్తున్నాయి. రాష్ట్రంలోని 12,765 గ్రామ పంచాయతీల్లో 3,700 తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 1,682 గ్రామ పంచాయతీలు, 1,276 తండాలున్నాయి. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో 273 తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా మారాయి. ఆ తండాలకు 273 మంది గిరిజనులే సర్పంచులయ్యారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఓ పంచాయతీ కార్యదర్శి, కనీసం ముగ్గురికి తక్కువ కాకుండా మల్టీపర్పస్‌ వర్కర్లు వచ్చారు. వీరందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. తండాల్లో అభివృద్ధి పరుగులు పెట్టేందుకు సీఎం తీసుకున్న నిర్ణయమే కారణమని గిరిజనులు గర్వంగా చెప్తున్నారు.

అపార అవకాశాలు..

తండాలు గ్రామపంచాయతీలుగా మారటంతో ఎస్టీలకు రాజకీయంగా అవకాశాలు విస్తృతమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,700 తండాల్లో సర్పంచులుగా, సుమారు 25 వేల వార్డు మెంబర్లుగా గిరిజనులు ఎన్నికయ్యారు. అనేక గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్‌ వర్కర్లుగా వారే పనిచేస్తున్నారు. గతంలో తండాలకు నిధులు వచ్చేవికావు. ప్రధాన గ్రామ పంచాయతీల్లో పనులకే ప్రాధాన్యం ఉండేది. శివారు గ్రామాలుగా ఉండే తండాలను పట్టించుకునే పరిస్థితే లేకుండేది. తండాలు గ్రామపంచాయతీలుగా మారిన తర్వాత మంచి రోడ్లు, డ్రైనేజీలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు సహా అనేక సౌకర్యాలు తరలివచ్చాయి. ఇప్పుడు తండాల్లోనే ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. దాంతో స్థానికులకు అక్కడే ఉపాధి పనులు లభిస్తున్నాయి. స్థానికంగా జరిగే అన్ని అభివృద్ధి పనుల్లోనూ స్థానికులకు అవకాశాలు వస్తున్నాయి. గతంలో తండాల్లో కనీస సౌకర్యాలు లేక మంచినీళ్లు దొరక్క, ఉపాధి అవకాశాలు కరువై అనేక మంది వలసలు వెళ్లేవారు. ఇప్పుడు వారంతా తిరిగి వచ్చి వారి తండాల్లోనే కూలీ పనులు, వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.

నాటి కూలీలే.. నేటి పాలకులు..

ఈయన పేరు కేతావత్‌ రవి నాయక్‌. స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం చెన్నంగులగడ్డ తండా. తనకున్న ఐదెకరాల ఎకరాల భూమిలో వ్యవసాయం చేద్దామంటే బోర్లు, బావులు ఎండిపోయాయి. వేరే ఉపాధినిచ్చే పనులేవీ లేక పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లి పుణె, ముంబై, గాంధీనగర్‌ తదితర ప్రాంతాల్లో మేస్త్రీ పని చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సొంతూరికి తిరిగి వచ్చాడు. తండాలు గ్రామ పంచాయతీలుగా మారటంతో వీరి తండా కూడా జీపీగా మారింది. రవి సర్పంచ్‌గా గెలిచాడు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాడు. వ్యవసాయం కూడా చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. తండా పంచాయతీ కావడంతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందని, లక్షల రూపాయల నిధులతో తండా రూపురేఖలే మారిపోయాయని చెప్తున్నాడు.

రేషన్‌ కోసం 3 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది

మా తండా గ్రామ పంచాయతీ కావడానికి ముందు నేరళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శివారు గ్రామంగా ఉండేది. ప్రతి పనికీ మేం ఆ గ్రామానికి వెళ్లాల్సి వచ్చేది. రేషన్‌ బియ్యం తెచ్చుకునేందుకు కూడి మూడు కిలోమీటర్ల నడక తప్పేది కాదు. మా ఊరు కూడా గ్రామ పంచాయతీ కావడంతో ఇక్కడే అన్ని వసతులు ఏర్పాటయ్యాయి. ఉపాధి హామీ పనులు బాగా జరుగుతున్నాయి. ప్రతి ఇంటికీ నల్లా వచ్చింది. ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు 100 శాతం నిర్మించుకుని పారిశుధ్యానికి పెద్ద పీట వేస్తున్నాం. తండాలో గతంలో కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి జరుగుతున్నది.
లలిత మంజూనాయక్‌, బాలానగర్‌ మండలం ఊటకుంట తండా సర్పంచ్‌

కేసీఆర్‌ వల్లే తండాలు పంచాయతీలైనాయి
ఉద్యమ నేత కేసీఆర్‌ 2008 ఏప్రిల్‌ 11 తెలంగాణ ఆత్మ గౌరవ యాత్రలో భాగంగా తండాలోని మా ఇంట్లో పల్లెనిద్ర చేశారు. మరుసటి రోజు ఇంటింటికీ పోయి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు లేకుండా జనం పడుతున్న పాట్లు చూసి ఆవేదన చెందారు. మా తండా వేదికగానే రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, రెండోది కల్యాణలక్ష్మి పథకం. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చాక ఇచ్చిన రెండు హామీలు నెరవేరాయి. తెలంగాణ ఎందుకు వచ్చిందంటే ఇదిగో ఇందుకు అని మేం చెప్పుకునేలా చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

వాల్యానాయక్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తండాలకు మహర్దశ
తండాలకు మహర్దశ
తండాలకు మహర్దశ

ట్రెండింగ్‌

Advertisement