బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:38:51

యోధుడా జోహార్‌!

యోధుడా జోహార్‌!

  • మహేశ్‌ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం
  • ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం: సీఎం
  • నీ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది
  • మహేశ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళి
  • కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటన
  • మహేశ్‌ భౌతికకాయానికి మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత నివాళి

  హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారత్‌- పాక్‌ సరిహద్దుల్లో ముష్కరులను అసమాన సాహసంతో ఎదిరించి, వీరమరణం పొందిన తెలంగాణకు చెం దిన సైనికుడు ర్యాడ మహేశ్‌ కుటుంబానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అండగా నిలిచారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా మని భరోసా ఇచ్చారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సైనికుడు మహేశ్‌ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించి భారతమాత ఒడికి చేరిన యోధుడిగా మహేశ్‌ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. మహేశ్‌ కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. మహేశ్‌ కుటుంబానికి ఇంటిస్థలం కూడా కేటాయిస్తామని సీఎం తెలిపారు.


  నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

  అమరజవాన్‌ ర్యాడ మహేశ్‌ పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమరవీరుడికి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మహేశ్‌ భౌతికకాయాన్ని ఆయన సొంత ఊరు నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు మండలం, కోమన్‌పల్లి గ్రామానికి తరలించారు. బుధవారం సైనికలాంఛనాలతో వీరుడికి అంతిమసంస్కారాలు జరుగుతాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అంత్యక్రియలకు హాజరవుతారు.