e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home తెలంగాణ గాంధీ మార్గంలోనే తెలంగాణ తెచ్చాం

గాంధీ మార్గంలోనే తెలంగాణ తెచ్చాం

  • అహింసా పోరాటంతోనే విజయం సాధించాం
  • మన స్వాత్రంత్య్ర సంగ్రామం..ప్రపంచంలోనే ఉజ్వల ఘట్టం
  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రారంభంలో సీఎం కేసీఆర్‌
  • పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకావిష్కరణ

హైదరాబాద్‌, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ అహింసామార్గం ప్రపంచానికే శాంతిమంత్రం నేర్పిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నా రు. గాంధీమార్గంలోనే నడిచి శాంతియుతంగా పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని కూడా సాధించుకున్నామని చెప్పారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం పబ్లిక్‌గార్డెన్స్‌లో ప్రారంభించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే ముఖ్యఘట్టమైన ఉప్పు సత్యాగ్రహాన్ని 1930లో ఇదేరోజున ప్రారంభించారని.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న దండి గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ప్రపంచానికే ప్రేరణ

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు అవుతున్న సందర్భంలో భారతజాతి మొత్తం స్వాతంత్య్ర అమృత ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఈరోజే శ్రీకారం చుట్టింది. మన రాష్ట్రంలోనూ ఈ వేదిక నుంచి అమృత ఉత్సవాలను మనం ప్రారంభించుకుంటున్నాం. భారతదేశ స్వాతంత్య్ర చరిత్ర ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఒక మహోజ్వలమైన ఘట్టం. భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని గాంధీకి ముందు.. గాంధీ తర్వాత అని విశ్లేషణ చేయాల్సిన అవసరమున్నది. గాంధీ కంటే ముందు స్వాతంత్య్ర పోరాటం జరిగింది. కానీ, గాంధీ పూర్తిస్థాయిలో నేతృత్వం వహించాక అద్భుతమైన ఘట్టాలు ఆవిష్కరించబడ్డాయి. గాంధీతోపాటు స్వాతంత్య్ర పోరాటంలో ఉన్నవారు.. అయ్యేదా, పొయ్యేదా.. అంటూ చాలా సందర్భాల్లో సంశయానికి గురయ్యేవాళ్లు. అహింస. శాంతియుత పంథాలో ప్రజలు ఉద్యమించాలి అనే నినాదం కొంతమందికి నిరాశ కలిగించింది. కానీ, చివరకు ఆ పంథాలోనే స్వాతంత్య్రం సిద్ధించింది. ఉద్యమ ఉద్ధృతి, అనుసరించాల్సిన కార్యాచరణ, పోరాటంలో ప్రజలను మమేకంచేయడంలో మహాత్మాగాంధీ యావత్‌ ప్రపంచానికే ఆదర్శ ప్రాయులయ్యారు. మానవహక్కుల కోసం పోరాడిన మార్టిన్‌ లూథర్‌కింగ్‌కు సైతం గాంధీజీ ఆచరణ, సిద్ధాంతాలు ప్రేరణగా నిలిచాయి. యావత్‌ ప్రపంచానికే మన దేశ స్వాతంత్య్ర సమరస్ఫూర్తి ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా గర్వంగా ప్రకటిస్తున్నా.

జాతీయోద్యమానికి ఊపిరి.. ఉప్పు సత్యాగ్రహం

- Advertisement -

బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు అనేక ప్రజా వ్యతిరేకచట్టాలు తెచ్చే క్రమంలో ఉప్పుచట్టాన్ని తెచ్చారు. ఉప్పు తయారీకి పన్ను కట్టాలనే ఈ చట్టం.. అంతకుముందు స్వేచ్ఛగా ఉప్పు తయారుచేసుకొనేవారికి బాధాకరంగా పరిణమించింది. గాలి, నీరు ఎంత అవసరమో, ప్రతిరోజూ తినే ఆహారంలో ఉప్పూ అంతే అవసరం. ఇలాంటి ఉప్పుపై కఠినమైన చట్టాల ద్వారా పన్నులభారం మోపారు. ఇది ప్రజా వ్యతిరేకమని చెప్పి గాంధీ మాట్లాడారు. కానీ తొందరపడలేదు. ప్రజలే నేరుగా నిరసించాలనేస్థాయి వరకు తీసుకువెళ్లి.. ఆ తర్వాత 1930 మార్చి12వ తేదీ.. ఇదే రోజున ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఇందులోభాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సమీపంలోని సబర్మతి నుంచి అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న నవసారి జిల్లాలోని దండి గ్రామం వరకు పాదయాత్ర జరపాలని నిర్ణయించారు. 24 రోజులపాటు 384 కిలోమీటర్లు సాగిన దండియాత్రలో గాంధీజీతోపాటు 79 మంది పాల్గొన్నారు. ఆయన వెంట నడిచింది కొద్దిమందే అయినా గాంధీజీ ప్రకటన వినడానికి సబర్మతి ఆశ్రమ పరిసరాల్లో 70 వేల మంది హాజరయ్యారు.

అడ్డంకులను అధిగమించి దండికి.. 

గాంధీతోపాటు, సత్యాగ్రహులను దండిదాకా వెళ్లనిస్తారా? అని చాలామంది అనుమానాలు వ్యక్తంచేశారు. మధ్యలోనే అరెస్టుచేస్తారా? లేదా కాల్చివేస్తారా? అనే భయాలు నెలకొన్నాయి. ప్రజలకు భారంగా మారిన చట్టాలను వెనక్కు తీసుకోవాలని, లేకుంటే సివిల్‌ డిసొబీడియన్స్‌ (శాసన ఉల్లంఘన) చేస్తానని నాటి బ్రిటిష్‌ వైస్రాయ్‌కి గాంధీ లేఖరాశారు. ఆ లేఖను అహంకారంతో వైస్రాయ్‌ పరిహాసం చేయడమే కాకుండా, అవమానించేలా మాట్లాడాడు. గాంధీయాత్ర కూడా చేయలేడు, వృద్ధుడైనాడు, 61 ఏండ్ల వయస్సులో ఈ యాత్ర సాధ్యం కాదని పరిహాసించాడు. కానీ ఆత్మనిష్ఠతో, కృతనిశ్చయంతో స్వాతంత్య్ర సముపార్జనే జీవితలక్ష్యంగా కొనసాగిన గాంధీ ఆ యాత్రను విజయవంతంచేశారు. ఆయన వెంట నడిచింది 79 మందే అయినా.. యాత్ర ఆసాంతం వేలాదిగా ప్రజలు పాల్గొనడంతో అదొక వెల్లువలాగా, ప్రవాహంలాగా సాగింది. ఒక నది ఉప్పొంగి ప్రవహిస్తుంటే ఆ తెల్లని నురగ ఎట్ల పోతుందో దండియాత్ర కూడా అదేవిధంగా సాగుతున్నదని అని జవహర్‌లాల్‌నెహ్రూ ఆ యాత్రను అభివర్ణించారు. దండియత్ర స్వాతంత్య్ర ఉద్యమంలో మహోజ్వలమైన ఘట్టంగా నిలిచింది. అహింసామార్గంలో, శాంతియుతంగా నిరసనను ఎ లా తెలియజేయవచ్చో ప్రపంచానికే పాఠం నేర్పిన ఒక గొప్ప చారిత్రక సన్నివేశం. అందుకే భారత ప్రభుత్వం ఈ దండియాత్ర స్ఫూర్తితో.. మార్చి 12 నుంచే స్వాతంత్య్ర అమృత ఉత్సవాలు నిర్వహించాలని సంకల్పించింది. స్వాతంత్య్ర సముపార్జన ఎంత కీలకమో, తద్వారా లభించిన హక్కులను, బాధ్యతలను విస్మరించకుండా నేటితరం కూడా నిలబెట్టుకోవాలని, ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటూ, ఈ తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. 

బ్రిటిష్‌ సామ్రాజ్యానికి హెచ్చరిక

ఆరోగ్యాన్నిసైతం లెక్క చేయకుండా మహాత్మాగాంధీ దండి గ్రామం వరకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు 70 వేల మందిపైగా స్వాగతం పలికారు. గాంధీ సముద్రస్నానం చేసి పిడికెడు ఉప్పును లేవనెత్తారు. ‘ఇది బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల పునాదులను కదిలించే సన్నివేశమిది.. మీ శాసనాలను ఉల్లంఘిస్తున్నాం’ అని నినాదించారు. మన హైదరాబాద్‌ ముద్దుబిడ్డ సరోజినీనాయుడు ఆ దండియాత్రలో ఉన్నారు. సరోజినీనాయుడు గొంతులోగొంతు కలిపి ఆ 70 వేల మంది నినాదాలుచేశారు. 

నలువైపులకు సత్యాగ్రహం

గాంధీ పిలుపును అందుకున్న ఉప్పు సత్యాగ్రహం దేశ నలుమూలలా వ్యాపించింది. ఎక్కడికక్కడే ప్రజలు ఉప్పు తయారుచేసే వారిపై దండయాత్రచేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం గాంధీని నిర్బంధించి ఎరవాడ జైలుకు తరలించింది. దాంతో సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ పెషావర్‌లో ఉద్యమాన్ని లేవదీశారు. అలా పరంపరగా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ అద్భుతంగా యాత్ర సాగింది. ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేశారు, ఆస్తి త్యాగంచేశారు. జీవితాలను త్యాగంచేశారు. అద్భుతమైన స్ఫూర్తితో అనేక త్యాగాలతో స్వాతంత్య్ర సముపార్జన జరిగింది. 

ఆత్మ బలిదానాలతో స్వాతంత్య్రం

దండియాత్రలో తనవెంట పాల్గొన్న అంతర్జాతీయ మీడియాతో గాంధీ ‘మేం భారతీయులం బలహీనులుగా ఉన్నాం, మాకు బలం కావాలి, ప్రపంచ ప్రజల సహకారాన్ని, బలాన్ని ఈ సందర్భంగా కోరుతున్నా’ అని చెప్పారు. గాంధీ జైలు నుంచి విడుదలైన తర్వాత నానాటికి పెరుగుతున్న ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని గమనించిన బ్రిటిష్‌ ప్రభుత్వం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించింది. అక్కడితో ఉప్పు సత్యాగ్రహం ముగిసింది. నాటి టైమ్స్‌ మ్యాగ్జిన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ అని గాంధీని ప్రశంసించింది. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఘట్టాలు, ఎన్నో త్యాగాలు, రక్త తర్పణలు, ఆత్మ బలిదానాల అనంతరం మనకు స్వాతంత్య్రం వచ్చింది. ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగుతున్న ఈ శుభ సందర్భంలో మనం కూడా 75 ఏండ్ల ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం.

రమణాచారి ఆధ్వర్యంలో కమిటీ

సమర్థమైన అధికారిగా పేరు, ప్రతిష్ఠలు పొంది.. ప్రభుత్వ సలహాదారుగా తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమైనపాత్ర పోషిస్తున్న రమణాచారిని ఉత్సవాల నిర్వహణ కమిటీకి అధ్యక్షుడిగా నియమించుకొని ముందుకుసాగుతున్నాం. 75 వారాలపాటు అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించింది. భాతర స్వాతంత్య్ర పోరాట రూపాలను, స్ఫూర్తిని, సందేశాన్ని నేటి యువతరానికి, భావితరానికి తెలిసేలా రమణాచారి ఆధ్వర్యంలో కమిటీ అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నది. ప్రతి పాఠశాలలో, కళాశాలలో వక్తృత్వపోటీలు, వ్యాసరచన పోటీలు, నేటితరం కవులందరినీ సమీకరించి కవి సమ్మేళనాలు, అనేక రకాల సాంస్కృతిక ప్రదర్శనలతో 75 వారాల కార్యక్రమానికి నేటినుంచి శ్రీకారం చుడుతున్నాం. 

గాంధీ ఆదర్శంగా తెలంగాణ పోరాటం

దాదాపు 20 ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని పారంభించే సమయంలో గాంధీచేసిన అద్భుతమైన స్వాతంత్య్ర పోరాట వ్యూహరచనను పుణికిపుచ్చుకున్నాం. నా సహచరులు చాలా సందర్భాల్లో నిరాశ, నిస్పృహలకు లోనయినా ఆ పంథా వీడలేదు. అహింసా మార్గంలో నడిచి, శాంతియుతంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మీ అందరికీ తెలుసు. తాను రాసిన లేఖను వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ ఆ లేఖను అపహాస్యం చేయగా.. గాంధీజీ ఒక మాట చెప్పారు. ‘నేను మోకాళ్ల మీద వంగి నమస్కరించి రొట్టె కావాలని అడిగాను, దానికి ప్రత్యామ్నాయంగా రాయి వచ్చింది.. కానీ మేము రాళ్లు విసరం, మీ బ్రిటిష్‌ సైన్యం కానీ, మీ బ్రిటిష్‌ పోలీసులు కానీ మమ్ముల్ని కొట్టినా ఆత్మనిష్ఠతో, కర్తవ్యదీక్షతో ముందుకుసాగుతాం. మీరు కొట్టే లాఠీ దెబ్బలకు చేతులు అడ్డం కూడా పెట్టం’ అని చెప్పారు. అది ఆత్మనిష్ఠకు పరాకాష్ట. బ్రిటిష్‌ పోలీసులు కొడుతుంటే బాధను మౌనంగా భరించారు, ఓర్చుకున్నారు కానీ ప్రతిఘటించలేదు. ఎక్కడా హింసకు పాల్పడలేదు, దాంతో ప్రజల హృదయాలు కదిలాయి. లక్షలమంది ప్రజలను పోరాటంలో భాగస్వామ్యం చేయడానికి ప్రేరణగా నిలిచింది.

అందరూ భాగస్వాములు కావాలి

అందరిని నేను ప్రార్థించేది ఒకటే. ఈ గొప్ప వేడుకల్లో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలి. అన్ని శాఖల్లో అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, సర్పంచ్‌లు, రాజకీయాలు, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతంచేయాలని పిలుపు ఇస్తున్నా. కార్యక్రమాల వివరాలు రమణాచారి ఎప్పటికప్పుడు మీడియాద్వారా అందిస్తారు. నేనుకూడా అన్నిచోట్ల పాల్గొనే ప్రయత్నం చేస్తాను, ఈ రోజు రాష్ట్రంలో రెండుచోట్ల ఈ కార్యక్రమం జరుగుతున్నది. రాజధాని నగరంలో నేను, చారిత్రక నగరం వరంగల్‌లో మన రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌గారు ప్రారంభించారు. నా అభ్యర్థన మేరకు గవర్నర్‌ అక్కడ ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లి గొప్పగా నిర్వహించుకుందామని, జాతికి స్వేచ్ఛ ప్రసాదించిన స్వాతంత్య్రాన్ని మరువకుండా, స్వాతంత్య్ర స్ఫూర్తితో, అభ్యుదయ పథంలో ప్రగతి కాముకులుగా మనందరం ముందుకు సాగుదామని, మీ అందరికీ మనవి చేస్తున్నా.

అహింసామార్గంలో, శాంతియుతంగా నిరసనను ఎలా తెలియజేయవచ్చో ప్రపంచానికే పాఠం నేర్పిన ఒక గొప్ప చారిత్రక సన్నివేశం దండియాత్ర. అందుకే భారతప్రభుత్వం ఈ దండియాత్ర స్ఫూర్తితో.. మార్చి 12 నుంచే స్వాతంత్య్ర అమృత ఉత్సవాలు నిర్వహించాలని సంకల్పించింది. స్వాతంత్య్ర సముపార్జన ఎంత కీలకమో, తద్వారా లభించిన హక్కులను, బాధ్యతలను విస్మరించకుండా, ఎప్పటికప్పుడు పునశ్చరణ చేస్తూ.. వాటిని ఈ తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. 

– సీఎం కేసీఆర్‌

దేశాభివృద్ధిలో తెలంగాణ కీలకపాత్ర

  • అన్ని రంగాల్లోనూ అద్భుత పురోగతి..
  • ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో గవర్నర్‌ తమిళిసై

దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టానిది కీలకపాత్ర అని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు. శుక్రవారం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో గవర్నర్‌ జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో దేశం ప్రతిరంగంలోనూ అద్భుత పురోగతి సాధిస్తున్నదని చెప్పారు. ప్రపంచానికి సవాలుగా మారిన కరోనాను ఎదుర్కోవడంలో భారత్‌ మార్గం చూపిందని పేర్కొన్నారు. 50కిపైగా దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించిందని చెప్పారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థితినుంచి హరిత విప్లవంతో ఆహార సమృద్ధి సాధించామని చెప్పారు. దేశం మిగులు విద్యుత్తుగా దిశ గా పురోగమిస్తున్నదని.. శాస్త్రసాంకేతిక రంగాల్లో అగ్రదేశాల సరసన నిలించిందని తెలిపారు. రైల్వే నెట్‌వర్క్‌ను బుల్లెట్‌ ట్రైన్‌ను నడిపేస్థాయిలో అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా స్వాతంత్య్రోద్యమ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవాలని గవర్నర్‌ సూచించారు. గాంధీ నేతృత్వంలో అహింసా పద్ధతిలో జరిగిన స్వాతంత్య్ర పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వాంతంత్య్ర పోరాటాలకు దారి చూపిందని తెలిపారు.స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఇప్పటివరకు సాధించిన విజయాలను స్మరించుకుంటూనే.. భవిష్యత్‌ కార్యక్రమాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేది మాత్రమే కాదని… వందేండ్ల స్వతంత్ర భారత్‌ ఎలా ఉండాలనేది తీర్చిదిద్దుకునేందుకు గొప్ప అవకాశమని తెలిపారు. శక్తివంతమైన స్వయం సమృద్ధితో మనదేశం బలమైన శక్తిగా మారాలని.. త్రివర్ణ పతాకం ఎప్పుడూ రెపరెపలాడాలని ఆకాంక్షించారు. చారిత్రక నగరం వరంగల్‌లో ‘అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అనుభూతిని కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana