సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 01:40:11

కరోనాపై ‘ఛోటా భీమ్‌' యుద్ధం!

కరోనాపై ‘ఛోటా భీమ్‌' యుద్ధం!
  • ప్రజలను చైతన్యపరిచేందుకు ‘గ్రీన్‌గోల్డ్‌' వినూత్న ప్రచారం
  • ట్విట్టర్‌ ద్వారా పంచుకున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్‌ కంపెనీ ‘గ్రీన్‌ గోల్డ్‌' కరోనా వైరస్‌ వ్యాధి (కోవిడ్‌-19)పై ప్రజలను చైతన్యపరిచేందుకు తనదైన శైలిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం అత్యంత ప్రజాదరణ పొందిన తమ కార్టూన్‌ క్యారెక్టర్‌ ‘ఛోటా భీమ్‌'ను రంగంలోకి దింపింది. కోవిడ్‌-19 విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, కరోనా వైరస్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ‘ఛోటా భీమ్‌' ద్వారా వివరిస్తూ గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సంస్థ రూపొందించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నది. ఈ వీడియోను ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. 


చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడే ‘ఛోటా భీమ్‌' క్యారెక్టర్‌ ద్వారా కరోనా వైరస్‌ లాంటి కీలక అంశంపై ప్రజలను చైతన్యపరిచేందుకు ముందుకొచ్చిన గ్రీన్‌గోల్డ్‌ సంస్థను కేటీఆర్‌ అభినందించారు. కరోనా వైరస్‌పై ప్రజల్లో, ముఖ్యంగా బడిపిల్లల్లో అవగాహనకు ఈ ప్రచారం దోహదపడుతుందని గ్రీన్‌గోల్డ్‌ సంస్థ ఆశాభావాన్ని వ్యక్తంచేసింది.


logo