శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 03:01:01

సేవలు మరింత సరళం

సేవలు మరింత సరళం

  • పోర్టల్‌లో సాంకేతిక అడ్డంకులకు చెక్‌

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. పలు సాంకేతిక సమస్యలు, ప్రత్యేక సంఘటనలపై దృష్టి సారించింది. అవాంతరాలను అధిగమించింది. ధరణిలో కొత్త అంశాలను జోడించింది. రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించి.. శరవేగంగా సేవలందించేలా చర్యలు చేపట్టింది. 

ధరణి పోర్టల్‌లో కొత్తగా..

స్లాట్‌ బుకింగ్‌ సమయంలో దొర్లిన తప్పులను సవరించుకొనేలా ఆప్షన్‌ ఇచ్చారు. బుకింగ్‌ సమయంలో పొరపాటున ఏదైనా తప్పు దొర్లితే స్లాట్‌బుకింగ్‌ చేసుకుంటున్న వ్యక్తి స్వయంగా సవరించుకొనేలా, తప్పులను ఎనేబుల్‌ చేసుకొనేలా సిటిజన్‌ కాలంలో సవరణలు చేశారు. 

ధరణి ఆపరేటర్స్‌ లాగిన్‌లో సాక్షుల క్యాప్చర్‌ బయోమెట్రిక్‌ దశనుంచి మళ్లీ సాక్షుల ఎంట్రీ దశకు వెళ్లేలా అవకాశం కల్పించారు. దీనివల్ల తొలుత కార్యాలయానికి వచ్చి బయోమెట్రిక్‌ సమయంలో సాక్షి వెళ్లిపోయినా, వేలిముద్రలు సక్రమంగా లేనివారి స్థానంలో మరొక సాక్షిని చేర్చేందుకు అవకాశం కలుగుతుంది.

ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి అనువాదం చేసినప్పుడు కొన్ని తప్పులు దొర్లడం సహజం. ఇకనుంచి ధరణిలో ఇలాంటి తప్పులు దొర్లకుండా సాంకేతికతను జోడించారు. ఇంగ్లిష్‌లో నమోదుచేసిన పదాలు ఎలాంటి తప్పులు దొర్లకుండా తెలుగులో నమోదు చేసుకొనే ఆప్షన్‌ కల్పించారు. ఈ ప్రత్యేక సదుపాయాలతో  ధరణి రిజిస్ట్రేషన్లలో మరింత వేగం పెరుగుతుందని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఏ రోజు డాక్యుమెంట్లు అదేరోజు 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుందని పెండింగ్‌ సమస్యే ఉండదని పేర్కొంటున్నారు.

చాలా సంతృప్తిగా ఉన్నది

రోజురోజుకు రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. తొలిరోజు మూడు స్లాట్‌లు బుక్‌ అయితే ఒక రిజిస్ట్రేషన్‌ చేశాం. మా దగ్గర తొమ్మిదో తేదీన అత్యధికంగా ఏడు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. సాప్ట్‌వేర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవు. మొదటిరోజు రిజిస్ట్రేషన్‌ చేయడానికి 30 నిమిషాలు పట్టింది. కానీ, ఇప్పుడు 10 నిమిషాల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. వచ్చిన పని వెంటనే పూర్తవుతుండటంతో రైతులు సంతోష పడుతున్నారు. పెండింగ్‌ మాటే లేదు. మాక్కూడా చాలా సంతృప్తిగా ఉన్నది. 

- శ్రీలత, తల్లాడ తాసిల్దార్‌, ఖమ్మం జిల్లా

బహుశా దేశంలో ఇదే మొదటిసారి

ఇంత సులభమైన రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ బహూశా దేశంలో ఇదే మొదటిసారి. భూమి అమ్మాలనుకున్న వ్యక్తి పోర్టల్‌ ద్వారా ఎంత విస్తీర్ణం మేర.. ఎవరికి విక్రయించదలుచుకున్నాడో తెలుపుతూ స్లాట్‌బుక్‌ చేసుకుంటే సరిపోతుంది. కొనుగోలుదారు, వారి కుటుంబసభ్యుల వివరాలు, సాక్షుల వివరాలు నమోదుచేసి, నిర్దేశిత స్టాంప్‌ డ్యూటీ చెల్లిస్తే చాలు. తాసిల్దార్‌ కార్యాలయానికి వచ్చాక 10-15 నిమిషాల్లోపే ప్రక్రియ పూర్తవుతున్నది.

-వెంకట్‌రెడ్డి, బీబీనగర్‌ తాసిల్దార్‌, యాదాద్రి భువనగిరి జిల్లా