శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 01:33:01

కాలుష్యానికి చెక్‌

కాలుష్యానికి చెక్‌
  • కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌
  • పాత కర్మాగారాల మూసివేత
  • ఇప్పటికే నాలుగు యూనిట్లు మూత
  • మిగతావి ఈనెల 31లోగా..
  • 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్తప్లాంట్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఐదు దశాబ్దాలపాటు విద్యుత్‌ వెలుగులను అందించిన కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఆపరేషన్స్‌ అండ్‌   మెయింటనెన్స్‌ (ఓఅండ్‌ ఎం) కర్మాగారం చివరి అంకానికి చేరుకున్నది. కేటీపీఎస్‌లోని ఎనిమిది పాత యూనిట్లను శాశ్వతంగా మూసివేసేందు కు నిర్ణయించిన టీఎస్‌ జెన్కో యాజమాన్యం ఈనెల 31వతేదీ నాటికి పూర్తిచేసేలా కసరత్తు చేస్తున్నది. 60 ఏండ్లుగా సుదీర్ఘ సేవలందించిన ఈ కర్మాగారం నేడు కాలుష్యం కారణంగా కనుమరుగు కానున్నది. దీనిస్థానంలో అత్యాధునిక పరికరాలతో 800 మెగావాట్ల సామర్థ్యంతో కేటీపీఎస్‌ ఏడో దశ కర్మాగారం నూతనంగా రూపుదాల్చుకున్నది. 


50 ఏండ్ల కిందట నిర్మాణం

అరవై ఏండ్ల క్రితం జర్మన్‌ సాంకేతికతతో నిర్మించిన కేటీపీఎస్‌ ఓ అండ్‌ఎంలోని ఏ,బీ,సీ స్టేషన్లలో ఉన్న 8 యూని ట్లు ఇక కనపడవు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఈ యూనిట్లు పనిచేయకపోవడం, అధిక యాష్‌ను బయటికి విరజిమ్ముతూ పాల్వంచ, పాల్వంచ డివిజన్‌లోని పలు గ్రామాలను బూడిదతో ముంచెత్తడంతోవాటిని మూసివేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. 


శరవేగంగా కొత్త నిర్మాణాలు..

కేటీపీఎస్‌ కర్మాగారంలో ఏ, బీ, సీ స్టేషన్లలో దశలవారీగా 720 మెగావాట్ల సామర్థ్యంతో 8 యూనిట్లను  నిర్మించారు. ‘ఏ’ స్టేషన్‌లో నాలుగు యూనిట్లు (6X40 = 240), ‘బీ’ స్టేషన్‌లో 5, 6 యూనిట్లు, ‘సీ’ స్టేషన్‌లో 7,8 యూనిట్లను (120X4 = 480) నిర్మించారు. ఇది రాష్ట్రంలో మొట్టమొదటి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కావడం విశేషం. పరిస్థితుల ఆధారంగా వీటి నిర్మాణం దశలవారీగా కొనసాగింది. ఈ కర్మాగారాల ద్వారా ఈ ప్రాంతంలో వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. నీరు, భూమి, బొగ్గు అందుబాటులో ఉండటంతో కేటీపీఎస్‌లో ఉత్పత్తి కర్మాగారాల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలో కేటీపీఎస్‌లో మరో మూడు యూనిట్ల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. కేటీపీఎస్‌లో 5వ దశలోని 9, 10 యూనిట్ల (2X250 మెగావాట్ల) నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఆ తరువాత 6వ దశలో 500 మెగావాట్ల సామర్థ్యంతో  11వ యూనిట్‌ను యూనిట్‌, ఆ తర్వాత కేటీపీఎస్‌లో ఏడో దశలో  800 మెగావాట్ల సామర్థ్యం గల నూతన కర్మాగారానికి పునాదులు పడ్డాయి.


కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు కాలుష్యకారక కర్మాగారాలకు స్వస్తి పలుకుతున్నారు. ఇందులో భాగంగా యాభై ఏండ్ల కిందట నిర్మించిన కొత్తగూడెం థర్మల్‌ పవర్‌స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఓఅండ్‌ఎం ఏ,బీ,సీ స్టేషన్లలోని 8 యూనిట్లను మూసివేసేందుకు టీఎస్‌ జెన్‌కో నిర్ణయించింది. వీటిలో ఇప్పటికే నాలుగింటిని నిలిపి వేయగా.. ఈనెల 31 నాటికి మిగతావాటిని మూసేందుకు కసరత్తు చేస్తున్నది. వాటి స్థానంలో అధునాతన సాంకే తిక పరిజ్ఞానంతో 800 మెగావాట్ల సామర్థ్యంతో కేటీపీఎస్‌ ఏడో దశ కర్మాగారం రూపుదిద్దుకొంటున్నది. 


పొల్యూషన్‌ వల్లే మూత

కేటీపీఎస్‌ ప్రాంగణంలో ఉన్న పాత యూ నిట్ల నుంచి కాలుష్యం వెదజల్లుతున్నందున వాటిని మూసివేసేందుకు నిర్ణయించాం. దశలవారీగా వాటిని మూసివేస్తున్నాం. మిగిలిన యూనిట్లను ఈనెల 31 వరకు మూసివేసేందుకు కసరత్తు చేస్తున్నాం. కేటీపీఎస్‌ ప్రాంగణంలో మిగిలిన యూనిట్ల వల్ల కాలుష్య సమస్య లేదు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పొల్యూషన్‌ లేని నూతన కర్మాగారాలు కేటీపీఎస్‌ కర్మాగారంలో ప్రస్తుతం ఉన్నాయి.  

- లక్ష్మయ్య, టీఎస్‌జెన్కో డైరెక్టర్‌


కాలుష్యరహిత కర్మాగారాలు

ప్రస్తుతం కేటీపీఎస్‌ ఆప రేషన్స్‌ మెయింటెన్స్‌లోని కర్మాగారాలను తీసివేస్తే కాలుష్యం తగ్గినట్టే. కొత్తగా నిర్మిస్తున్న కర్మాగారాల నుంచి కాలుష్యం తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడ పొల్యూషన్‌ అనేది లేకుండా అధునాతన పరికరాలతో కొత్త ప్లాంట్లను నిర్మిస్తాం. దీంతో ప్రజలకు కాలుష్య సమస్య తీరినట్టే. 

- సమ్మయ్య, కేటీపీఎస్‌ 7వ దశ సీఈ


logo