గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:36:02

ధరణితో భూ సమస్యలకు చెక్‌

ధరణితో భూ సమస్యలకు చెక్‌

  • అన్ని వివరాలు వెబ్‌సైట్‌లో
  • పూర్తి పారదర్శకంగా ఏర్పాటు
  • అవినీతి అంతం కోసమేనన్న సీఎం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో భూ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ధరణి పోర్టల్‌ పనిచేస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ భూ సంబంధ అంశాల్లో అత్యంత పారదర్శకంగా ఉండేందుకు ధరణిని తీసుకొచ్చినట్లు తెలిపారు. ‘ధరణి పోర్టల్‌ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో ఎవరైనా చూసుకోవచ్చు. ఓపెన్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ లేదా కాపీ చేసుకోవచ్చు. ఇదే ప్రధానమైన రికార్డు అవుతుంది. మొత్తం ఆయువుపట్టు అవుతుంది. ఐటీ అధికారులకు చెప్పాను. అన్నింటికీ మూలం ఇదే అనుకున్నప్పుడు సాంకేతికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మల్టిపుల్‌ సర్వర్స్‌ మల్టీపుల్‌ ప్రాంతాల్లో ఉంచి రికార్డులను కాపాడాలని సూచించాను. దేశంలో సురక్షిత పాంతాల్లోనూ ఉంటాయి. బ్యాకప్‌ మెకానిజం లేదా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ అంటాం. అలాంటి మెకానిజంలో ఈ రికార్డులు పెడుతాం. 

ధరణిలో అన్ని వివరాలుంటాయి. భూముల వివరాలు వ్యవసాయ, వ్యవసాయేతర అని రెండు భాగాలుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌.. తెలంగాణ నుంచి ఏడు మండలాలను ప్రధాని మోదీ అప్రజాస్వామికంగా, మన అంగీకారం లేకుండా మన నుంచి గుంజుకుని ఏపీకి ఇచ్చిన తర్వాత.. మన దగ్గర మొత్తం లక్షా 12 వేల చదరపు కిలోమీటర్ల భూమి ఉన్నది. అంటే ఇది 2.75 కోట్ల ఎకరాలకు సమానం. ఇది మన రాష్ట్ర మొత్తం భూభాగం. ఇందులో వ్యవసాయానికి అనువైన భూమి 1.55-1.60 కోట్ల మధ్య ఉంటుంది. 66.56 లక్షల ఎకరాల అటవీ భూములు ఉంటాయి. తర్వాత ప్రభుత్వ భూములు, గ్రామకంఠం అని క్యాటగిరీలు ఉంటాయి. పట్టణాల కింద ఉండే భూమి, పబ్లిక్‌ యుటిలిటీస్‌ పేరిట భూమి అనేక రూపాల్లో ఉంటుంది. మొత్తం మీద ఒకటి వ్యవసాయ భూమి, రెండు అటవీ భూమి, మూడు వ్యవసాయేతర భూమిగా మన రాష్ట్రంలో భూములున్నాయి’ అని సీఎం వివరించారు.

తాజావార్తలు


logo