బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 01:54:56

దొంగ ఓటుకు చెక్‌

దొంగ  ఓటుకు చెక్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దొంగ ఓట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం చెక్‌ పెట్టనున్నది. అనుమానాస్పద ఓట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. పోలిం గ్‌ కేంద్రాలవారీగా ఓటర్ల జాబితాలోని ఏఎస్డీ (ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ఆబ్సెంటీ, షిఫ్టెడ్‌, డూప్లికేట్‌/డెత్‌) ఓటర్ల జాబితాను తయారుచేసి దొంగ ఓట్లను నివారించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించే ప్రిసైడింగ్‌ అధికారు(పీవో)లకు ఎన్నికల సామగ్రితోపాటు ఏఎస్డీ జాబితాను ప్రత్యేకంగా అందించాలని రిటర్నింగ్‌ అధికారులను గురువారం ఆదేశించింది. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఈ జాబితాలోని ఓటర్లు ఎవరైనా ఓటు వేసేందుకు వస్తే ప్రిసైడింగ్‌ అధికారి అతడి ఓటరు కార్డును క్షుణ్ణంగా పరిశీలించి, పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో గుర్తింపును నిర్ధారించుకుంటారు. అనంతరం కౌంటర్‌ఫైల్‌ బ్యాలెట్‌ పేపర్‌ (బ్యాలెట్‌ పేపర్‌తోపాటు ఉండే మరో పేపర్‌)పై సదరు ఓటరు సంతకంతోపాటు వేలిముద్రను సేకరిస్తారు. అవసరమైతే ఫొటో కూడా సేకరించే అధికారం పీవోలకు కల్పించారు. పోలింగ్‌ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఏఎస్డీ జాబితాలోని ఎంతమంది ఓటు వేశారనే దానిపై ప్రిసైడింగ్‌ అధికారి రిపోర్టు రూపొందించి ఆర్వోకు సమర్పిస్తారు. ఈ ప్రక్రియలో ఇతరుల పేరుతో ఓటు వేసేందుకు వచ్చేవారు వెంటనే  దొరికిపోతారని ఎన్నికల సంఘం పేర్కొన్నది.