మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 19:29:56

డిజిటల్ టెక్నాలజీతో.. గొర్లు, జంతువుల అక్రమాలకు చెక్

డిజిటల్ టెక్నాలజీతో.. గొర్లు, జంతువుల అక్రమాలకు చెక్

హైదరాబాద్ :   రాష్ట్రంలో గొర్లు, ఇతర జంతువులను గుర్తించేందుకు వాటి సమగ్ర సమాచారం పక్కాగా రికార్డులలో భద్ర పర్చేందుకు.. డిజిటల్ టెక్నాలజీని అమలు చేయడం ఉత్తమం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు. మంత్రుల నివాసంలో మల్కాజిగిరి లోక్ సభ టీఆర్ఎస్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి జియోస్టాట్ ఇంఫార్మటిక్ సంస్థ ఎండీ వివేక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వినోద్ కుమార్ కు ఈ టెక్నాలజీ ని వివరించారు.

మనుషుల గుర్తింపు కోసం ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న విధంగానే గొర్లు, జంతువుల ముక్కును ఫొటో తీసి డిజిటలైజ్ చేయడం ద్వారా వాటి పక్కా రికార్డ్ అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుందని వివేక్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోపియన్ దేశాలలోని బీమా సంస్థలు అమలు చేస్తున్నాయని వారు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని,  ఈ పథకం గొర్రెలు పక్క దారి పట్టకుండా ఉండేందుకు ముక్కు ఫొటో తీసే డిజిటల్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

 ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల చెవులకు జియో ట్యాపింగ్ చిప్ ఉన్నా.. కొందరు ఆ చెవులను కోసేసి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. ముక్కు ఫొటో తీసే కొత్త టెక్నాలజీ తో దాన్ని చెక్ పెట్టె అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ వారికి హామీనిచ్చారు.


logo