మంగళవారం 26 మే 2020
Telangana - May 03, 2020 , 02:00:04

మాస్టర్‌ ప్లాన్‌ను మారుస్తాం

మాస్టర్‌ ప్లాన్‌ను మారుస్తాం

  • హైదరాబాద్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మార్పులు
  • వేగంగా రహదారుల నిర్మాణం పూర్తి.. మే నెలాఖరు వరకు వర్కింగ్‌సీజన్‌
  • ఈలోగా పనుల పూర్తికి చర్యలు: అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాజధాని హైదరాబాద్‌లో రహదారులు, లింక్‌రోడ్ల నిర్మాణానికి అనుగుణంగా.. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్‌ప్లాన్‌ను అప్‌డేట్‌ చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను శీఘ్రగతిన పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మే చివరి వరకు పనులు చేయడానికి వాతావరణం అనువుగా ఉంటుందని, జూన్‌ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పనులు అనుకున్నంత స్థాయి లో ముందుకు సాగవని పేర్కొన్నారు. హైదరాబాద్‌ రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌ (హెచ్చార్డీసీఎల్‌) ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనుల పురోగతిని శనివారం బుద్ధభవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు.

హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన అన్నారు. దేశంలో లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకొన్న రాష్ట్రంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించినట్టు పేర్కొన్నారు. మేలో కొన్ని పనులను ప్రారంభించుకొందామని, ఇందుకు అనుగుణంగా పనులకు తుదిమెరుగులు దిద్దాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింక్‌ రోడ్ల ఏర్పాటులో భూసేకరణ ఇబ్బందులను తొలిగించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నిర్వాసితులయ్యే పేదలు, కూలీల పట్ల మానవీయకోణంతో వ్యవహరించాలని.. వారికి పునరావాసం కల్పించాలని సూచించారు. హైవేలను అనుసంధానంచేస్తూ నిర్మిస్తున్న లింక్‌ రోడ్ల వెడల్పు 120 అడుగులు ఉండాలని స్పష్టంచేశారు. ఈ రోడ్ల వల్ల ఆయా ప్రాంతాలు వేగంగా అభివద్ధి చెందుతాయన్నారు. 

 మాస్టర్‌ప్లాన్‌ అప్‌డేట్‌ చేస్తాం

ఎస్సార్డీపీ, లింక్‌, సర్వీస్‌ రోడ్లను పొడిగించేందుకు హెచ్‌ఎండీఏ, ఇతర విభాగాలతో సమన్వయంచేసుకోవాలని కేటీఆర్‌ అధికారులకు సూచించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని పనులు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌ మాస్టర్‌ప్లాన్‌ను అప్‌డేట్‌చేయనున్నట్టు ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా రోడ్లనిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూసేకరణ చేయాలని చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఆయూబీలు, ఆర్వోబీలతోపాటు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. నిధుల కొరతలేదన్నారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వారు ఫ్రంట్‌లైన్‌ హీరోస్‌: మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

కరోనాపై పోరులో ముందున్న మెడికల్‌, హెల్త్‌ కేర్‌ సిబ్బందికి మంత్రి కే తారకరామారావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోరాటంలో వారు ఫ్రంట్‌లైన్‌ హీరోస్‌ అంటూ శనివారం ట్విట్టర్‌ ద్వారా ప్రశంసించారు.

ట్రాఫిక్‌  ఫ్రీ  హైదరాబాద్‌

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. దేశంలో లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకొన్న రాష్ట్రంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించింది. మే నెలలో కొన్ని పనులను ప్రారంభించు కొందాం. ఇందుకు అనుగుణంగా పనులకు అధికారులు తుదిమెరుగులు దిద్దాలి.

- హెచ్చార్డీసీఎల్‌ పనుల పురోగతిపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌


logo