సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 01:43:21

మన విద్య ఎలా ఉండాలి?

మన విద్య ఎలా ఉండాలి?

  • ఉపాధికి అనుగుణమైన ఉన్నత, సాంకేతిక విద్య
  • ప్రాథమిక విద్యలో మార్పులతో శ్రీకారం
  • అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీ
  • సమగ్ర విద్యావిధానం రూపకల్పన దిశగా!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సమగ్ర విద్యావిధానానికి రూపకల్పన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఉన్నత, సాంకేతిక విద్య ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేదిగా ఉండాలని భావిస్తున్నది. ఇందుకోసం ముందుగా ప్రాథమిక విద్య, పాఠశాల విద్యావిధానంలో మార్పులు చేపట్టాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో అనుసరిస్తున్న బోధ నా పద్ధతులు, పాఠ్యాంశాలపై అధ్యయనం చేయా లని నిర్ణయించింది. దీనికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌, ఇద్దరు వైస్‌ చైర్మన్లు, సెస్‌ డైరెక్టర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఐఈపీఏ) వైస్‌చైర్మన్‌ ప్రొ ఫెసర్‌ ఎన్వీ వర్గీస్‌, యూజీసీ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ సుఖ్‌దేవ్‌తోరట్‌, రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ ప్రస్తుతం ప్రాథమిక విద్యావిధానంలో బోధిస్తున్న పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులపై అధ్యయనం చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న విద్యావిధానాన్ని పరిశీలిస్తున్నది. రాష్ట్రంలో 1969 నుంచి ఒకే విద్యావిధానం కొనసాగుతున్నదని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉన్నదని ఉన్నత విద్యామండలి, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) భావిస్తున్నాయి. విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మేధావులు, విశ్లేషకులు ఇలా అన్ని వర్గాలకు చెందినవారి నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు. వాటిని క్రోడీకరించి ఉన్నత విద్యామండలికి అందిస్తారు. ఈ అధ్యయనం మూడేండ్లపాటు కొనసాగవచ్చని సమాచారం. అవసరమైతే మరో రెండేండ్లు కూడా పొడిగించవచ్చని తెలిసింది.


logo