మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 01:58:54

సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి

సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి

  • బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌షా  

పటాన్‌చెరు: సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని యువత జీవితంలో రాణించాలని బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌షా పిలుపునిచ్చారు. శనివారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవం సందర్భంగా వర్చువల్‌ విధానంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి విసిరిన సవాలుకు భారత్‌ సరైన విధంగా స్పందించి అవకాశాలను సృష్టించుకుందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా దేశ బయోటెక్‌ రంగం స్టార్టప్‌లతో పరుగులు పెడుతున్నదని చెప్పారు. కొవిడ్‌ ప్రారంభ దశలో దేశంలో సరైన సదుపాయాలు లేవని.. పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల కోసం విదేశాలపై ఆధారపడ్డామని గుర్తుచేశారు. తొమ్మిది నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారి సరైన దిశలో మహమ్మారిని కట్టడి చేయగలగడం గర్వంగా ఉందన్నారు. సవాళ్లను అవకాశంగా మార్చుకోవడంతో తక్కు వ వ్యవధిలోనే దేశం ఆరోగ్య రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. గీతం చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే రామకృష్ణారావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన విద్యతోపాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్నదని చెప్పారు. గీతం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ శివరామకృష్ణ మాట్లాడుతూ.. గీతంలో రెగ్యులర్‌, దూరవిద్య విధానంలో దాదాపు లక్షా 20 వేల మంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో గీతం పరిశోధకులు 25 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు ఎం భరత్‌ తదితరులు పాల్గొన్నారు.సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి