బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 31, 2020 , 01:59:04

ఇక్కడే కరోనా పరీక్షలు

ఇక్కడే కరోనా పరీక్షలు
  • నేడు పరీక్ష కిట్లను హైదరాబాద్‌కు పంపనున్న కేంద్రం
  • రేపటినుంచి గాంధీలోనే పరీక్షలు నిర్వహించే అవకాశం
  • ఏర్పాట్లు పూర్తిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఇక హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నది. కరోనా వ్యాధి అనుమానితుల శాంపిల్స్‌ను మహారాష్ట్రలోని పూణెకు పంపడం.. అక్కడనుంచి నివేదికలు రావడానికి ఎక్కువ సమయం పడుతున్నది. దీంతో అన్ని వసతులు ఉన్న గాంధీ దవాఖానలోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గాంధీలో ఉన్న వసతులు, యంత్ర పరికరాలు వంటి సమాచారంతో వైద్య, ఆరోగ్యశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అనుమతించిన కేంద్రం.. శుక్రవారం అందుకు అవసరమైన కిట్లను పంపనున్నది. దీంతో శనివారం నుంచే గాంధీలో ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నది.  


ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గాంధీ దవాఖానలో నిర్ధారణ పరీక్షలు చేయగలిగితే అనుమానిత కేసులకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుందని వైద్య విభాగాలు వెల్లడించాయి. ఎటువంటి ప్రాణాంతక వైరస్‌ అయినా చికిత్సను ఒక్కచోటనే అందించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఛాతి దవాఖాన ప్రాంగణంలో  క్లీన్‌వార్డు కాన్సెప్ట్‌ పేరిట ప్రత్యేక వైద్యకేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. తద్వారా స్వైన్‌ఫ్లూ, నిఫా, ఎబోలా, తాజాగా కరోనా వంటి వైరస్‌లకు ఒకేచోటనే వైద్యం అందించే అవకాశం ఏర్పడుతుంది.


హైదరాబాద్‌లో రెండు కరోనా అనుమానిత కేసులు

కరోనా సోకినట్టు అనుమానం ఉన్న ఇద్దరు వ్యక్తులకు హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్‌ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. చైనా నుంచి ఇటీవల వచ్చిన ఒక వ్యక్తి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఫీవర్‌ దవాఖానలో, మరో అనుమానిత రోగి గాంధీలో చికిత్స పొందుతున్నట్టు వివరించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల నిమిత్తం వారి నుంచి శాంపిల్స్‌ను సేకరించి, పూణెలోని వైరాలజీ విభాగానికి పంపనున్నట్టు వెల్లడించారు.  


పరిశుభ్రతతో కరోనాకు చెక్‌: సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా కరోనా వైరస్‌ బారినుంచి తమను తాము కాపాడుకోవచ్చని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా పేర్కొన్నారు. కరోనా వైరస్‌ స్పర్శ, గాలి వల్ల ఒకరినుంచి మరొకరికి వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు పాటించాలని, చేతులను తరుచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. గురువారం ఆయన ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి సాధారణ జలుబు లక్షణాలే ఉంటాయని చెప్పారు.


ముక్కుకారడం, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇలాంటివారు గుంపులుగా ఉన్న ప్రజలకు మధ్యకు వెళ్లకపోవడం మంచిదని, టిష్యూ, కర్చిఫ్‌ వంటివి ఉపయోగించాలని చెప్పారు. ఇంట్లోనే ఉండి పూర్తి విశ్రాంతి, ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలున్నవారు కొన్నిరోజులు దవాఖానలో ఉండి చికిత్స పొందాల్సి ఉంటుందని చెప్పారు. సాధారణ జలుబు లక్షణాలే ఉండటం వల్ల కరోనా వైరస్‌ లక్షణాలను గుర్తించడం సంక్లిష్టమవుతుందని, అయితే, వాటి ఆర్‌ఎన్‌ఏ వేర్వేరుగా ఉన్నందున వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా గంటల్లోనే గుర్తించవచ్చని వివరించారు.


logo