ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 02:42:54

అనుమతిచ్చేదాకా ఆపాల్సిందే!

అనుమతిచ్చేదాకా ఆపాల్సిందే!

 • సీమ ఎత్తిపోతలతోపాటు కొత్త ప్రాజెక్టులపై జల్‌శక్తి ఆదేశం
 • సీమ లిఫ్టు డీపీఆర్‌ను కృష్ణాబోర్డుకు సమర్పిస్తామన్న ఏపీ సీఎం
 • కొత్త ప్రాజెక్టులుంటే తామూ డీపీఆర్‌లు ఇస్తామన్న సీఎం కేసీఆర్‌
 • నదీ బోర్డు పరిధులను నోటిఫై చేస్తామన్న కేంద్ర మంత్రి షెకావత్‌
 •  ప్రాజెక్టులవారీ కేటాయింపుల్లేనందున అంగీకరించమన్న కేసీఆర్‌
 • విభజనచట్టం ప్రకారం తమకు అధికారమున్నందన్న కేంద్రమంత్రి
 • రెండు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పంపిణీ వేగంగా చేస్తామని హామీ
 • సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటామన్న సీఎం కేసీఆర్‌
 • గోదావరి జలాల పంపిణీపై రెండు ప్రతిపాదనలు చేసిన షెకావత్‌
 • రెండు రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం రాకపోతే కొత్త ట్రిబ్యునల్‌
 • గోదావరి నీటి మళ్లింపుపై కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడి
 • అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంపై కేంద్ర జల్‌శక్తి శాఖ వివరాలు వెల్లడి

ఎజెండా అంశాలివి..

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధులను నిర్ధారించడం (నోటిఫై)

ఆరేండ్లుగా కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధులను నిర్ధారించలేదు. ఈ అంశంపై రెండు రాష్ర్టాలు ఏకాభిప్రాయానికి రానందున ఇది సాధ్యంకాలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ర్టాల మధ్య జలాల పంపిణీని పర్యవేక్షించడం, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనల్ని సాంకేతికంగా పరిశీలించి, పరిష్కరించడం బోర్డుల బాధ్యత. బోర్డుల పరిధిని నిర్ధారించకపోవడం వల్ల రెండు రాష్ర్టాల మధ్య జలాల పంపిణీకి సంబంధించిన అంశాలు అపరిష్కృతంగా పెరిగిపోతున్నాయి. అయితే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే వరకు బోర్డుల పరిధిని నిర్ధారించవద్దని తెలంగాణ స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం పరిధిని నిర్ధారించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం బోర్డుల పరిధిని నిర్ధారించాలనేది కేంద్రం ప్రతిపాదన. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-2) అవార్డు అమల్లోకి వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా, అందులోని అంశాల ప్రాతిపదికన పరిధి, పర్యవేక్షణ, నీటి కేటాయింపుల్ని నిర్ధారించుకోవచ్చు. రెండు రాష్ర్టాల ప్రయోజనాల్ని కేంద్రం పరిరక్షిస్తుంది. 

కొత్త ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌) బోర్డులకు సమర్పించడం

రెండు రాష్ర్టాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆయా నదీ యాజమాన్య బోర్డులకు సమర్పించాలి. వాటిని ఆయా బోర్డుల పరిధిలోని సాంకేతిక కమిటీ పరిశీలించి, క్లియరెన్స్‌ ఇస్తుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ర్టాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలి. ఈ రెండు రాష్ర్టాలేకాదు.. దేశంలోని ఏ రాష్ట్రమైనా అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టే ముందు హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, పర్యావరణ అంశాల అనుమతులు తీసుకునేందుకు సంబంధిత చట్టబద్ధత కలిగిన సంస్థలకు డీపీఆర్‌లను సమర్పిస్తాయి. 

 • బచావత్‌ కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులు పాత ప్రాజెక్టులు
 • ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్‌-11లో పొందుపరిచిన ప్రా జెక్టులు కూడా పాత ప్రాజెక్టులే. ఇతర ఏవైనా ప్రాజెక్టులకు కేటాయింపులు లేనట్లయితే బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ద్వారా కేటాయింపులు జరుగుతా యి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నది. 
 • కేటాయింపులు లేని పాత ప్రాజెక్టులు, రాష్ట్ర విభజన తర్వాత మార్పులు (చేంజ్‌ ఆఫ్‌ స్కోప్‌) చేసిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆయా రాష్ర్టాలు సంబంధిత బోర్డులకు  అనుమతి కోసం సమర్పించాలి.
 • పై జాబితాలోకి రానివి కొత్త ప్రాజెక్టుల జాబితాలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాలు ఇలాంటి ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆయా బోర్డుల అనుమతి కోసం             సమర్పించాలి. 
 • రెండు రాష్ర్టాలు కచ్చితంగా కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలి. వాటిని బోర్డులకు సమర్పించి,  అనుమతి తీసుకోనంత వరకు ఆయా ప్రాజెక్టులను చేపట్టరాదు. 

కృష్ణా, గోదావరిజలాల పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక (మెకానిజం) రూపొందించడం

దేశంలో ట్రిబ్యునళ్ల ద్వారానే నదీజలాల కేటాయింపులు జరుగుతాయి. ప్రస్తుతానికి బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు అమల్లో ఉన్నది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాలు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ర్టాల మధ్య గోదావరి జలాల పంపిణీకి సంబంధించి కేంద్రం రెండు ప్రతిపాదనలు సూచిస్తున్నది. 

1.రెండు రాష్ర్టాలు పరస్పరం ఒక ఒప్పందానికి రావడం.

 2.జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు. 

పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను ప్రకాశం బరాజ్‌కు మళ్లిస్తున్నందున బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం 45 టీఎంసీల వాటాపై ఒక కార్యాచరణ ప్రణాళికను కేంద్రం రూపొందిస్తుంది. కృష్ణాజలాల పంపిణీపై ఒక కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది. ర్టులో పెండింగులో ఉన్నది. 

కృష్ణాబోర్డు ప్రధాన

కార్యాలయాన్ని చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం  

ఈ అంశంపై రెండు రాష్ర్టాలు అంగీకారాన్ని తెలిపాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయం ఏపీ పరిధిలో ఉండాల్సి ఉన్నందున అక్కడికి తరలిస్తాం. అయితే ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేస్తారని కేంద్ర మంత్రి షెకావత్‌ అడగ్గా.. సీఎం జగన్‌ మాత్రం ముందు ఏపీకి తరలించేందుకు నిర్ణయించాలని, తదుపరి ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు.logo