సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 10, 2020 , 03:51:12

వెదురుదే భవిష్యత్‌

వెదురుదే భవిష్యత్‌
  • ఇతర రకాల కలపకు ఇది ప్రత్యామ్నాయం
  • రాష్ట్రంలో సాగుకు అపార అవకాశాలు
  • మహారాష్ట్రలోని పరిశ్రమలను సందర్శించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వెదురు సాగుకు చాలా అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. భవిష్యత్‌లో టేకు, ఇతర రకాల కలపకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని చెప్పారు. సోమవారం ఆయన వెదురు నిపుణుల బృందంతో కలిసి మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌ జిల్లా కుడాల్‌ ప్రాంతంలోని వెదురు పరిశ్రమలను సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి, విజయగాథలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండ్ల నిర్మాణంలో విరివిగా వాడుతున్న టేకు, ఇతర కలపకు రానున్నరోజుల్లో కొరత ఏర్పడి, వెదురు ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుందని చెప్పారు. కలప దొరకనిచోట వెదురుతో తయారయ్యే పెద్దపెద్ద చెక్కలు, డోర్లు, కిటికీలు, ఫ్లోరింగులు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని పేర్కొన్నారు. వెదురు బద్దలను ఒకదానితో ఒకటి కలిపి, ప్రెస్సింగ్‌ చేసి, భారీ హీటర్ల సాయంతో చెక్కలుగా మలుస్తారని, వీటిని తలుపులు, కిటికీలుగా తయారుచేసుకోవచ్చన్నారు. వాతావరణ కాలుష్యం నివారణకు కూడా వెదురుసాగు దోహదపడుతుందని చెప్పారు. ఈ పర్యటనలో మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంచార్జ్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర హార్టికల్చర్‌ కమిషనర్‌ ఎల్‌ వెంకట్రాంరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ (ఆస్కీ) డైరెక్టర్‌ అచీలెందర్‌రెడ్డి, ఎన్నారై శ్రీనివాస్‌ గోగినేని, కెనడా దేశ వెదురు నిపుణులు సుధీర్‌ కోదాటి, కృష్ణ కోమండ్ల తదితరులు పాల్గొన్నారు.  


వెదురుతో బహుళ లాభాలు

దేశంలో వెదురుసాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2004లో నేషనల్‌ బ్యాంబు మిషన్‌ను ఏర్పాటుచేసింది. దీనిని 2017లో మరింత బలోపేతం చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో కుడాల్‌ ప్రాంత రైతులు వెదురుసాగు చేపట్టి, మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. గడ్డి జాతికి చెందిన వెదురు వ్యవసాయానికి యోగ్యంకాని, రాళ్లు, రప్పలతో కూడిన భూముల్లో, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అవలీలగా పెరుగుతుంది. వెదురు మొక్కలను నాటిన నాలుగో ఏడాది నుంచి కోతకు వస్తుంది. ఎన్నిసార్లు కోసినా మళ్లీ మళ్లీ మొలకెత్తి, ప్రతి ఏటా ఆదాయాన్నిస్తుంది. వాతావరణంలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చి, ఆక్సిజన్‌ను విడుదలచేసే వెదురు కాలుష్య నివారణలోనూ సహాయపడుతుంది. 
logo