మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 00:56:03

ఎంపీ ల్యాడ్స్‌కు నిధుల్లేవట!

ఎంపీ ల్యాడ్స్‌కు నిధుల్లేవట!

  • కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఆగ్రహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం నుంచి గత 16వ లోక్‌సభ, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన 15 మంది ఎంపీలకు సంబంధించిన ఎంపీ ల్యాడ్స్‌ నిధులు రూ.150 కోట్లు మంజూరు కావాల్సి ఉన్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు నిధుల్లేక ఆగిపోయాయని, ఈ నేపథ్యంలోనే నిధులు మంజూరుచేయాలని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలుశాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌కు లేఖరాసినట్టు వివరించారు. అయితే నిధుల విడుదలకు చిల్లిగవ్వ లేదని కేంద్రం సమాధానమివ్వడం గమనార్హం. రాష్ట్రం నుంచి గత లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన 15 మంది ఎంపీలకు సంబంధించి రూ.95 కోట్లు, ఆరుగురు రాజ్యసభ సభ్యులకు సంబంధించి రూ.55 కోట్లు బకాయి నిధులు రావాల్సి ఉన్నది. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ కేంద్రం తీరును ఎండగట్టారు. కరోనా నేపథ్యంలో 17వ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు 2020-21, 2021-22 నిధులను విడుదలచేయలేమని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించిందని, అయితే గత టర్మ్‌ బకాయిలను విడుదలచేస్తామని హామీ ఇచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఆ హామీని కూడా తుంగలో తొక్కారని, నిధుల విడుదలకు చిల్లిగవ్వ లేదనడం అభ్యంతకరమని మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం నిర్లక్ష్యంచేస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా 16వ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు సంబంధించిన బకాయి ఎంపీ ల్యాడ్స్‌ నిధులను విడుదలచేయాలని డిమాండ్‌చేశారు.logo