శనివారం 30 మే 2020
Telangana - May 02, 2020 , 01:51:10

కేసుల రెట్టింపునకు 70 రోజులు

కేసుల రెట్టింపునకు 70 రోజులు

  • ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ చర్యలు
  • పకడ్బందీ కట్టడితో తగ్గుతున్న  కరోనా
  • 11 రోజుల వ్యవధిలోనే భారీ మార్పు
  • ఛత్తీస్‌గఢ్‌ తర్వాత రెండోస్థానంలో.. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పడక్బందీగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైరస్‌వ్యాప్తి గణనీయం గా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల రెట్టింపునకు పట్టే సమయం మునుపటితో పోలిస్తే పెద్దఎత్తున పెరిగింది. తాజాగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల రెట్టింపు రేటు ఏకంగా 70 రోజులకు పెరిగినట్టు జాతీయస్థాయి విశ్లేషణలు స్పష్టంచేస్తున్నాయి. ఏప్రిల్‌ 19వ తేదీ లెక్కల ప్రకారం కేసుల రెట్టింపునకు 9.4 రోజులు పట్టగా, అనంతరం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టి కరోనాకు కళ్లెం వేసింది. పక్కావ్యూహంతో 11 రోజుల వ్యవధిలోనే వైరస్‌ను కట్టడిచేసింది. ఏప్రిల్‌ 30నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో కేసుల రెట్టింపు రేటు 70 రోజులకు పెరిగింది. రెట్టింపు రేటు ఎక్కువ రోజులకు పెరిగిన రాష్ర్టాలతో పోలి స్తే దేశంలో ఛత్తీస్‌గఢ్‌ తర్వాత తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. ఇందులో దేశ సరాసరి 11 రోజులుగా ఉన్నది.

ఫలితమిచ్చిన తెలంగాణ చర్యలు

రాష్ట్రంలో కరోనా జాడను పక్కాగా గుర్తించడంతోపాటు వైరస్‌ విస్తరించకుండా చేపట్టిన చర్యలు మంచి ఫలితాన్నిచ్చాయి. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గణాంకాలను విశ్లేషించగా.. కేసుల రెట్టింపునకు పట్టే సమయం తెలంగాణలో భారీఎత్తున పెరిగినట్టు స్పష్టమవుతున్నది. తాజాగా తెలంగాణలో కేసుల రెట్టింపు రేటు 70 రోజులుగా ఉన్నది. ఈ అంశంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల సరళిని పరిశీలిస్తే మొదటిస్థానంలో ఛత్తీస్‌గఢ్‌ నిలిచింది. ఇక్కడ పాజిటివ్‌ కేసుల రెట్టింపు రేటు 89 రోజులుగా వెల్లడైంది. 70 రోజులతో తెలంగాణ రెండోస్థానంలో ఉండగా.. 59 రోజులతో అసోం మూడోస్థానంలో ఉన్నది. దేశంలో కేసుల రెట్టింపునకు సరాసరి 11 రోజులు పడుతున్నది. 

అప్రమత్తతతోనే రెండోస్థానం

ట్రావెల్‌ హిస్టరీ ఉన్న పాజిటివ్‌ కేసులు.. తద్వారా సోకినవారు.. వారిని కలిసినవారు.. ఇలా అన్ని క్యాటగిరీలవారిని గుర్తించిన ప్రభుత్వం త్వరితగతిన పాజిటివ్‌ కేసులను నిర్ధారించింది. గత నెల రెండోవారంలోనే రాష్ట్రంలో వైరస్‌ పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని అందరూ అంచనావేశారు. కానీ నిజాముద్దీన్‌ ఘటన తెరపైకి రావడంతో తెలంగాణలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరిగింది. ఏప్రిల్‌ 19న వెలువడిన విశ్లేషణలో తెలంగాణలో కరోనా కేసుల రెట్టింపు రేటు 9.4 రోజులుగా తేలింది. కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా  పది రోజుల్లోపే రెట్టింపు కేసులు నమోదవుతాయని హెచ్చరిక వచ్చింది. ప్రభుత్వం  కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని నిజాముద్దీన్‌ కేసులను గుర్తించి వైరస్‌ను నియంత్రణలోకి తెచ్చింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా గుర్తించి కఠిన ఆంక్షలను అమలుచేసింది. 

ఏప్రిల్‌ 19 లెక్కల ప్రకారం..

రెట్టింపు రేటు 10-20 రోజులు: ఢిల్లీ-8.5, కర్ణాటక-9.2, తెలంగాణ-9.4, ఏపీ-10.6, జమ్మూకశ్మీర్‌-11.5, పంజాబ్‌-13.1, ఛత్తీస్‌గఢ్‌-13.1, తమిళనాడు-14, బీహార్‌-16.4

రెట్టింపు రేటు 20-30 రోజులు: అండమాన్‌, నికోబార్‌-20.1, హర్యానా-21, లడఖ్‌, హిమాచల్‌ప్రదేశ్‌-24.5, చండీగఢ్‌-25.4, అసోం-25.8, ఉత్తరాఖండ్‌-26.6, లడఖ్‌-26.6.

రెట్టింపు రేటు 30 రోజుల పైబడి: ఒడిశా-39.8, కేరళ-72.2

ఏప్రిల్‌ 30వ తేదీ వివరాల ప్రకారం ..

రెట్టింపు రేటు 11-20 రోజులు: ఢిల్లీ-11, ఉత్తరప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌-12, ఒడిశా-13, రాజస్థాన్‌-17, తమిళనాడు, పంజాబ్‌-19

రెట్టింపు రేటు 20-40 రోజులు: కర్ణాటక-21, లడఖ్‌, హర్యానా-24, ఉత్తరాఖండ్‌-30, కేరళ-37

రెట్టింపు రేటు 40 రోజులకుపైబడి: అసోం-59, తెలంగాణ-70, ఛత్తీస్‌గఢ్‌-89

రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్‌జోన్‌

  • ఆరెంజ్‌ 18.. గ్రీన్‌జోన్‌లో 9 జిల్లాలు
  • తీవ్రత ఆధారంగా విభజించిన కేంద్రం

గతంలో నమోదైన కేసులు, వైరస్‌ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా దేశంలోని వివిధ రాష్ర్టాల్లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లలో మార్పులు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ అన్నిరాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. తెలంగాణలో ఆరు జిల్లాలను కేంద్రం రెడ్‌జోన్‌గా ప్రకటించింది. 18 జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌, 9 జిల్లాలను గ్రీన్‌జోన్‌గా గుర్తించింది. రెడ్‌, ఆరెంజ్‌ జోన్ల పరిధిలో తీసుకోవాల్సిన అప్రమత్త చర్యలను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ ప్రభుత్వ కార్యదర్శులకు సూచించారు. రెడ్‌జోన్‌ జిల్లాలను విస్తృతి ఎక్కువగా (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) ఉన్నవి, కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా విభజించారు. ఈ జిల్లాల్లో 21రోజులపాటు ఎలాంటి కేసులు నమోదుకాకపోతే గ్రీన్‌జోన్‌గా మార్పుచేస్తారు.  

తెలంగాణలో రెడ్‌జోన్‌ జిల్లాలు: హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌.

ఆరెంజ్‌ జోన్‌: నిజామాబాద్‌, జోగుళాంబ గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల.

గ్రీన్‌జోన్‌: పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి.


logo