e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home Top Slides రాష్ర్టానికి మరిన్ని రెమ్‌డెసివిర్‌

రాష్ర్టానికి మరిన్ని రెమ్‌డెసివిర్‌

రాష్ర్టానికి మరిన్ని రెమ్‌డెసివిర్‌
  • 10,500 ఇంజెక్షన్లు సరఫరా చేయనున్న కేంద్రం
  • 200 టన్నుల ఆక్సిజన్‌-వ్యాక్సిన్‌ సరఫరా పెంపు
  • సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఫోన్‌

హైదరాబాద్‌, మే 15 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆలకించింది. రాష్ర్టానికి ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్ల కోటాను పెంచుతామని తెలిపింది. ఈ మేరకు శనివారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు స్వయంగా ఫోన్‌చేసి ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణకు ఇస్తున్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల సంఖ్యను 5,500 నుంచి 10,500కు పెంచుతున్నామని తెలిపారు. ఆక్సిజన్‌ను 200 టన్నులు సరఫరా చేయనున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని భిలాయ్‌, ఒడిశాలోని అంగుల్‌, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి తెలంగాణకు ఆక్సిజన్‌ను సరఫరాచేయాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి సీఎంకు తెలిపారు.

సరఫరాకు సంబంధించి సమన్వయంచేసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. కరోనా నియంత్రణకోసం ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, వ్యాక్సిన్లను తెలంగాణకు తక్షణమే సరఫరాచేయాలని ప్రధాని నరేంద్రమోదీ తనకు ఆదేశాలు జారీచేశారని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఐదు పొరుగు రాష్ర్టాల నుంచి కరోనా రోగులు భారీ సంఖ్యలో హైదరాబాద్‌, రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లోని దవాఖానల్లో చేరుతుండటంతో వైద్యారోగ్య వ్యవస్థపై తీవ్రభారం పడింది. దీంతో ఉన్న వనరులనే రాష్ట్ర ప్రజలతోపాటు పొరుగు రాష్ర్టాల రోగులకు కూడా సర్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు తమకు కేటాయిస్తున్న ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, వ్యాక్సిన్ల కోటాను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతున్నది.

ప్రధానితో జరిగిన సమావేశంలో సైతం సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని ప్రస్తావించి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఎట్టకేలకు కేంద్రం సానుకూలంగా స్పందించి కోటా పెంచాలని నిర్ణయించింది. సోమవారం నుంచి పెంచిన కోటా ప్రకారం సరఫరా జరుగనున్నట్టు కేంద్రమంత్రి వెల్లడించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాష్ర్టానికి మరిన్ని రెమ్‌డెసివిర్‌

ట్రెండింగ్‌

Advertisement