శనివారం 11 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 04:21:48

నదులపై గుత్తాధిపత్యానికి కేంద్రం కసరత్తు

నదులపై గుత్తాధిపత్యానికి కేంద్రం కసరత్తు

  • గోదావరి జలాల మళ్లింపుపై చాలాకాలంగా గురి
  • మిగులు రుజువైతేనే అంగీకరిస్తామంటున్న తెలంగాణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ అక్రమంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుపై తెలంగాణ చేసిన ఫిర్యాదు పేరుతో కేంద్రం అన్ని నదులపై గుత్తాధిపత్యం చెలాయించే చర్యలకు ఉపక్రమిస్తున్నది. కేంద్రం అసలు గురి అంతా నదుల అనుసంధానంపై ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ర్టాల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా కేంద్ర జల్‌శక్తి నదుల అనుసంధాన ప్రాజెక్టులను చేపట్టాలని యోచిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఇందులోభాగంగా పెండింగ్‌లో ఉన్న గోదావరిజలాల తరలింపును సాకారం చేసుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. కేంద్రం 2014 నుంచే నదుల అనుసంధానంపై దూకుడుగా పోతున్నది. ఇందుకోసం జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రధానంగా 30 ప్రాజెక్టులను రూపొందించింది. ఇందులో పదహారు పెనిన్సులార్‌ (ద్వీపకల్ప) భాగంలో, మరో పద్నాలుగు హిమాలయ భాగంలో ఉన్నాయి. పెనిన్సులార్‌లోని అన్ని ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై ఎన్‌డబ్ల్యూడీఏ నివేదిక (ఎఫ్‌ఆర్‌)ను పూర్తిచేసింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ర్టాలకు ప్రాణాధారమైన కృష్ణా, గోదావరికి సంబంధించి మూడు చొప్పున ఆరు ప్రతిపాదనలు రూపొందించారు. వాస్తవంగా అనుసంధాన జాబితాలో ముందుగా మహానది- గోదావరి నదుల అనుసంధానంలో భాగంగా మణిభద్ర నుంచి గోదావరి (ధవళేశ్వరం) అలైన్‌మెంట్‌ను పూర్తిచేయాలి. అప్పుడే గోదావరిలో మిగులు అనేది సాధ్యమవుతుందని గతంలో అనేక ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో నిపుణులు నొక్కిచెప్పారు. కానీ, కేంద్రం మాత్రం తొలుత కావేరీకి గోదావరిజలాలను తరలించే అలైన్‌మెంట్‌పైనే దూకుడుగా ముందుకుపోయేందుకు ప్రయత్నించింది. గోదావరిలో అన్నిరాష్ర్టాల అవసరాలు, కేటాయింపులు పోను మిగులును చూపాల్సిన కేంద్రం ఇప్పటివరకు దానిపై శాస్త్రీయంగా స్పష్టత ఇవ్వలేదు. గోదావరిలో తన వాటాతోపాటు అవసరాలకు మించిఉన్న మిగులును తీసుకెళ్లడంతో తమకెలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం అనేక వేదికలపై కేంద్రానికి స్పష్టంచేసింది. మహానది-గోదావరి అనుసంధానంలోనూ ఒడిశా కూడా శాస్త్రీయంగా మిగులును చూపాకే జలాలను తరలించాలని కోరుతున్నది.

తనకిష్టమైన చోటకు జలాలు

నదుల అనుసంధానమంటే జలాలు మిగులు ఎక్కువగా ఉన్న దగ్గర మాత్రమే చేపట్టాలి. గతంలో రాష్ర్టాలు ప్రాజెక్టులను కట్టి ఇలాంటి కారణాలతోనే జలాలను సద్వినియోగం చేసుకోలేకపోయాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ మాత్రం భారీఎత్తున గోదావరిజలాల వినియోగాన్ని సాకారం చేసుకుంటున్నది. ‘గతంలో తెలంగాణ పరిధిలో వంద టీఎంసీల గోదావరిజలాల వినియోగమే గగనం. ఇప్పుడు ఒక్క కాళేశ్వరంతోనే 530 టీఎంసీలకుపైగా వాడుకుంటాం. ఇంకా అవసరాలు ఉన్నాయి’ అని సీనియర్‌ ఇంజినీర్‌ ఒకరు స్పష్టంచేశారు. కానీ కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా గోదావరిజలాలను కావేరీకి తరలించాలనే ఒకే లక్ష్యంతో ముందుకుపోతున్నది. పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాలు కేంద్రం ప్రతిపాదనలపై భిన్నస్వరాలు వినిపిస్తున్నా.. రాష్ర్టాలు సహకరించడంలేదనే సాకుతో నదులపై గుత్తాధిపత్యం కోసం పలు చట్టాలకు రూపకల్పన చేసిందని విశ్రాంత ఇంజినీర్‌ ఒకరు చెప్పారు. తెలుగు రాష్ర్టాల పరిధిలోని కృష్ణా, గోదావరిపైఉన్న ప్రాజెక్టుల వివరాలను సేకరించి.. బేసిన్‌వారీగా ప్రాజెక్టులు, కేటాయింపులు బేరీజు వేసి, మిగులుజలాలు అంటూ తాము ఎంచుకున్న లక్ష్యం వైపు తరలించే ప్రమాదం ఉన్నదన్నారు.


logo