మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:13

రాష్ర్టాలు నష్టపోయేలా కేంద్రం ఆర్డినెన్స్‌

రాష్ర్టాలు నష్టపోయేలా కేంద్రం ఆర్డినెన్స్‌

  • రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు ఏటా రూ.346 కోట్ల నష్టం
  • ఆర్డినెన్స్‌పై న్యాయసలహాకు వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మార్కెటింగ్‌ విధానంలో మార్పులు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ రాష్ట్రానికి అశనిపాతంగా మారనున్నది. ఆర్డినెన్స్‌ అమలుతో ఏటా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు రూ.346 కోట్ల నష్టం వాటిల్లనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 వ్యవసాయచెక్‌పోస్టులు, ట్రేడర్ల లైసెన్సులు, వివిధ రకాల మిల్లులు, మార్కెట్లలో జరిగే లావాదేవీల ద్వారా మార్కెటింగ్‌శాఖకు ఆదాయం వస్తుంది. ఆర్డినెన్స్‌ అమలుచేస్తే చెక్‌పోస్టులను రద్దు చేయడంతోపాటు ట్రేడర్ల లైసెన్సులు కూడా రద్దవుతాయి. దీంతో ఆదాయం భారీగా పడిపోతుంది. ప్రస్తుతం లైసెన్స్‌ కలిగిన వ్యాపారులు మార్కెట్లలోనే పంటలను కొనుగోలు చేస్తున్నారు. అదే ఆర్డినెన్స్‌ అమలైతే వారంతా మార్కెట్లోనే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైనా పంటను కోనుగోలు చేయవచ్చు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాదు. ప్రస్తు తం రాష్ట్రంలో 2099 మంది రైస్‌మిల్లర్లు, 6,166 మంది వ్యాపారులు, 4,163 కమిషన్‌ ఏజెంట్లు ఉన్నారు. వీరంతా లైసెన్సులు రద్దు చేసుకుంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. 

ఉద్యోగులకు జీతాలు కష్టమే

ఈ ఆర్డినెన్స్‌ నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై న్యాయసలహా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్డినెన్స్‌ అమలుచేస్తే మార్కెటింగ్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారుతుంది. ప్రస్తుతం మార్కెటింగ్‌శాఖలో 730 మంది రెగ్యులర్‌, 1,500 మంది ఔట్‌సోర్సింగ్‌, మరో 1,500 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరి జీతాలతోపాటు మార్కెట్‌ నిర్వహణకోసం ఏటా రూ.250 కోట్ల వరకు అవసరం ఉంటుందని మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. ఓ వైపు ఆదాయ మార్గాలు మూసుకుపోతుంటే.. వీరికి జీతాలు ఏ విధంగా ఇవ్వాలనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 

పత్తి, వరితోపాటు మరికొన్ని పంటలకు ఎంఎస్‌పీ ధర ఉండడం, ఇప్పటికే కొనుగోలుకు ఆదేశాలు రావడంతో ఈ సీజన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని ఓ అధికారి అభిప్రాయం వ్యక్తంచేశారు. వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ పంట కొనుగోళ్లు చేయడం వల్ల మోసాలు జరిగే అవకాశం ఉంది. ధర ఎంత చెల్లిస్తారో కూడా తెలియక పోగా డబ్బులు ఇస్తారా? లేదా అనేది తెలియని పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారులు పంట ఉత్పత్తులకు డిమాండ్‌ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారు. ధర తగ్గినప్పుడు రైతు పంటలను అమ్ముకొనేందుకు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఉంటుంది. కరోనా నేపథ్యంలో రైతులు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేసింది. ఈ ఆర్డినెన్స్‌ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై మార్కెటింగ్‌ శాఖ దృష్టి సారించింది. 


logo