సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 18:16:59

జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానిదే : మంత్రి హ‌రీశ్‌రావు

జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానిదే : మంత్రి హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ : రాష్ట్రాలు జీఎస్టీలో చేరడం వల్ల 60 నుంచి 70 శాతం ఆదాయాన్ని కోల్పోయాయి. కేంద్రం మాత్రం 31 శాతం మాత్రమే కోల్పోయింది. అందువల్ల రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ర్ట ఆర్థిక‌శాఖ‌ మంత్రి హరీశ్ రావు అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు బీఆర్కే భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేసి వాడుకుంటోంది. సెస్ తగ్గినపుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని సూచించడం సమంజసం కాద‌న్నారు. కేంద్రమే జీఎస్టీ పరిహారం చెల్లించాల‌న్నారు. రాష్ట్రాలు అప్పులు తీసుకుంటే రాష్ట్రానికో వడ్డీ రేటు ఉంటున్న‌ట్లు తెలిపారు. దీనివ‌ల్ల‌ ఎంత కాల పరిమితితో తీసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి, ఎఫ్.ఆర్. బీ.ఎం పరిమితులు వంటి సమస్యలతో పాటు చెల్లింపుల్లోను గందర గోళం తలెత్తుంద‌న్నారు.

కేంద్రమే అప్పు తీసుకుంటే వడ్డీ రేటు తగ్గుతుంది కావునా కేంద్ర ప్ర‌భుత్వ‌మే బాధ్యత తీసుకుని గతంలో హమీ ఇచ్చినట్లు రెండు నెలలకొసారి జీఎస్టీ పరిహారం చెల్లించాలని కోరారు. ఐజీఎస్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రూ. 2700 కోట్లు రావాల్సి ఉంది. వెంటనే ఈ మొత్తాన్ని విడుదల చేయాలన్నారు. అత్యధికంగా జీఎస్టీ చెల్లించే  ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అయితే అత్యంత తక్కువ పరిహారం తీసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంద‌న్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం రూ. 18 వేల 82 కోట్లు జీఎస్టీ సెస్ రూపంలో కేేంద్రానికి చెల్లిస్తే.. తీసుకున్నది కేవలం రూ. 3 వేల 223 కోట్లు మాత్రమేన‌న్నారు. 

సెస్ వచ్చే ఈ  ఏడాది కోవిడ్ అని, జీఎస్టీ అమలు వల్ల నష్టమని విభజిస్తే తీవ్రంగా నష్టం పోతామ‌న్నారు. కేంద్రం అనుసరించే ఈ విధానం వల్ల పకృతి వైపరిత్యాలకు గురయిన రాష్ట్రాలు, ఆర్థిక నిర్వహణ సరిగా లేని రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చుతూ అభివృద్ధి దిశగా అడుగులు వేసే తెలంగాణ వంటి రాష్ట్రాలకు నష్టంగా పరిణమిస్తుంద‌న్నారు. 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల్లో కూడా తెలంగాణకు నష్టం జరిగిన‌ట్లు మంత్రి అభిప్రాయం వ్య‌క్తం చేశారు.  

కేంద్రం ప్రతిపాదనలు...

అన్ని రాష్ట్రాల  అభిప్రాయం తెలుసుకున్న జీఎస్టీ కౌన్సిల్ రెండు ప్రతిపాదనలు రాష్ట్రాల ముందుంచింది.

ప్రతిపాదన-1 -  కేంద్ర ప్రభుత్వమే రుణం తీసుకుని రాష్ట్రాలకు  ఇవ్వనుంది. ఈ ప్రతిపాదనలో కేవలం జీఎస్టీ అమలులో ఏర్పడిన రెవెన్యూ లోటు రూ. లక్షా 65 వేల కోట్లు రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. 

ప్రతిపాదన -2-  జీఎస్టీ, కోవిడ్ కారణాల వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటు రూ. 3 లక్షల కోట్లను రుణంగా తీసుకుని  రాష్ట్రాలకు చెల్లించడం జరుగుతుంది.  ఈ  రుణం రాష్ట్రాల పేరు మీద జీఎస్టీ కౌన్సిల్ తీసుకుని వడ్డీతో సహా రుణాన్ని చెల్లించడం జరుగుతుంది.

ఈ రెండు ప్రతిపాదనల‌పై ఏడు పని దినాలలో రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వెల్ల‌డించాల‌ని జీఎస్టీ కౌన్సిల్ ఛైర్ పర్సన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. రాష్ర్ట‌ మంత్రి హరీశ్ రావు ఈ సమావేశంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలను చాలా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ప్రస్తావించడంతో పాటు గట్టి మద్ధతును తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావుతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక, వాణిజ్య, పన్నులశాఖ అధికారులు పాల్గొన్నారు.logo