మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 06:29:53

నూత‌న జాతీయ విద్యా‌వి‌ధానం అమ‌లుపై డైల‌మాలో కేంద్రం

నూత‌న జాతీయ విద్యా‌వి‌ధానం అమ‌లుపై డైల‌మాలో కేంద్రం

హైద‌రా‌బాద్: విద్యా‌వ్య‌వ‌స్థలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసు‌కొ‌స్తున్న నూతన జాతీయ విద్యా‌వి‌ధా‌నం (‌ఎ‌న్‌‌ఈ‌పీ)–2020కు మోక్షం ఎప్పు‌డ‌నేది తెలి‌యడం లేదు. ఎప్పటి నుంచి ఈ విధా‌నాన్ని అమలు చేయా‌లన్న స్పష్ట‌తను కేంద్రం ఇవ్వ‌లే‌క‌పో‌తు‌న్నది. కేంద్ర క్యాబి‌నెట్‌ ఆమోదం తెలి‌పిన ఎన్‌‌ఈ‌పీపై ఇప్ప‌టికీ భిన్నా‌భి‌ప్రా‌యాలు వ్యక్త‌మ‌వు‌తూనే ఉన్నాయి. ఎన్‌‌ఈపీని విడు‌దల చేసి మూడు నెలలు గడు‌స్తున్నా దీన్ని ఎలా అమలు చేయాల‌నే అంశంపై కేంద్ర ప్రభుత్వం తర్జ‌న‌భ‌ర్జ‌నలో ఉన్నట్లు విద్యా‌వే‌త్తలు అభి‌ప్రా‌య‌ప‌డు‌తు‌న్నారు. 

విధా‌నంలో పొందుపరి‌చిన అంశాలు మంచివే అయి‌న‌ప్ప‌టికీ అమ‌లులో అది సాధ్యమా..? అన్న అను‌మా‌నాలు వ్యక్త‌మ‌వు‌తు‌న్నాయి. నాణ్య‌మైన విద్య, ప్రాంతీయ భాష‌లకు ప్రా ధాన్యం, ఉద్యోగ, ఉపా‌ధికి అను‌కూ‌లంగా ఉండే బోధన, కాలే‌జీ‌లకు స్వతంత్ర హోదా వంటి పలు అంశా‌లపై ఎన్‌‌ఈ‌పీలో ప్రము‌ఖంగా ప్రస్తా‌విం‌చారు. వీటిపై మరింత స్పష్టత రావాల్సి ఉన్న‌దన్న అభి‌ప్రా‌యాలు వ్యక్తం అవు‌తు‌న్నాయి. కొన్ని రాష్ట్రాలు కూడా తమ అభి‌ప్రా‌యాలు పంపేం‌దుకు సమా‌లో‌చ‌నలు చేస్తు‌న్నాయి. రాష్ట్రంలో పాఠ‌శాల విద్యా‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఎన్‌‌ఈపీ విధా‌నంపై అభి‌ప్రా‌యాలు పంపే కస‌రత్తు జరు‌గు‌తు‌న్నది. అటు.. నూతన జాతీయ విద్యా‌వి‌ధా‌నాన్ని అమ‌ల్లోకి తీసు‌కొస్తే, సంపూ‌ర్ణంగా అమలు చేసేం‌దుకు గరి‌ష్ఠంగా 15 ఏండ్లు పడు‌తుం‌దని విద్యా‌వే‌త్తలు అభి‌ప్రాయం వ్యక్తం చేస్తు‌న్నారు.  

ఎన్‌‌ఈ‌పీలో కొన్ని లోపా‌లు‌న్నా‌యని, వాటిని సరి‌చే‌స్తారా? ఉన్నది ఉన్న‌ట్టు‌గానే చట్టం చేస్తారా? అన్నది తేలాల్సి ఉన్న‌దని చెప్తు‌న్నారు. పార్ల‌మెం‌ట్‌లో చట్టం అయ్యే వరకు ఎన్‌‌ఈపీ అమలు సాధ్య‌మేనా? అన్న ప్రశ్నలు కూడా విని‌పి‌స్తు‌న్నాయి. ప్రాథ‌మిక విద్య నుంచి యూని‌వ‌ర్సిటీ విద్య వరకు ఎన్‌‌ఈ‌పీలో పొందు‌ప‌రి‌చిన అంశాలు బాగానే ఉన్నా‌యని, వాటిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణ‌యాలు ఏ విధంగా ఉంటా‌య‌న్నది తెలి‌యాల్సి ఉన్న‌దని రాష్ట్ర‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపి‌రెడ్డి పేర్కొ‌న్నారు.