మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 03:33:20

పంచాయతీల ఆడిట్‌ బాగుంది

పంచాయతీల ఆడిట్‌ బాగుంది

  • తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రశంస 
  • దేశానికి ఆదర్శనీయంగా రాష్ట్ర విధానం
  • ఇతర రాష్ర్టాలు స్ఫూర్తిగా తీసుకోవాలి
  • కేంద్ర పంచాయతీరాజ్‌ కార్యదర్శి సిఫార్సు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామ పంచాయతీల్లో తెలంగాణ నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ ఆడిట్‌ దేశానికే ఆదర్శమని కేంద్రం ప్రశంసించింది. కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీల ఆన్‌లైన్‌ ఆడిట్‌ ఈ నెల 30న ముగియనున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్‌ అన్ని రాష్ర్టాల్లో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఇందుకోసం అనుసరిస్తున్న విధానాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ఆడిట్‌ను తెలంగాణ విజయవంతంగా అమలుచేస్తున్నదని అన్నారు. టెలిగ్రామ్‌ యాప్‌లో ఆడిట్‌ అధికారులతో గ్రూపు ఏర్పాటుచేసి, మైక్రోసాఫ్ట్‌ యాప్‌ ద్వారా వీడియో క్లాసులు నిర్వహించడంతోపాటు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ పర్యవేక్షించే విధానం బాగున్నదని అభిప్రాయపడ్డారు. సమయానికి ఆన్‌లైన్‌ ఆడిట్‌ చేస్తూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నదని కొనియాడారు. ఇతర రాష్ర్టాలు దీనిని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఈ మేరకు తెలంగాణ ఆడిట్‌శాఖ డైరెక్టర్‌ మార్తినేని వెంకటేశ్వరరావు రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను అన్నిరాష్ర్టాలు పరిశీలించాలని సిఫారుసు చేశారు. 15వ ఆర్థికసంఘం సిఫారసులను అనుసరించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో పంచాయతీరాజ్‌ సంస్థల అకౌంట్లను ఆన్‌లైన్‌లో ఆడిట్‌ చేయడం తప్పనిసరి.  ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో ప్రతి రాష్ట్రం 20%జీపీల ఆడిట్‌ను ఆన్‌లైన్‌ చేసి, వచ్చే ఆర్థిక సంవత్సరం 100% జీపీలను చేయాలనేది నిబంధన. ఈ ఏడాది ఆగస్టు నాటికి తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు మాత్రమే చివరిదశ (అబ్జర్వేషన్స్‌) వరకు వెళ్లాయి. మొత్తం 24,060 అబ్జర్వేషన్లలో తెలంగాణ 20,119తో దేశంలోనే టాప్‌లో నిలిచింది. మిగిలిన రాష్ర్టాలు కొన్ని మధ్యలో ఉండగా ఒకట్రెండు చోట్ల ఆడిట్‌ను అసలు చేపట్టనే లేదు. తెలంగాణ ఆడిట్‌ శాఖ అధికారులు 3,217 గ్రామ పంచాయతీల్లో  339 మంది ఆడిటర్ల ద్వారా ఇప్పటివరకు 20,119 అబ్జర్వేషన్లతో అడిట్‌ రిపోర్టులను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.logo