e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home Top Slides స్కైవేలకు స్థలమివ్వరేం?

స్కైవేలకు స్థలమివ్వరేం?

  • తెలంగాణకు కేంద్రం సహాయ నిరాకరణ
  • కూలీతో బాలానగర్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం
  • స్థలం ఇవ్వకున్నా సుచిత్ర స్కైవే నిర్మిస్తాం
  • నిధులు, ప్రణాళిక ఉన్నా నాలుగేండ్లుగా జాప్యం
  • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఆవేదన
  • బాబూ జగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్‌గా నామకరణం

హైదరాబాద్‌, జూలై 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్కైవేల నిర్మాణానికి కేంద్రం స్థలం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్యాట్నీ- సుచిత్ర, జేబీస్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా తుర్కపల్లి వరకు స్కైవేలు నిర్మించేందుకు నాలుగేండ్లుగా ప్రయత్నిస్తున్నామని, రూ.3-4 వేల కోట్లయినా ఖర్చుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. భూసేకరణ కోసం కేంద్ర రక్షణశాఖ ఒప్పుకోకపోవడంతో వీటి నిర్మాణం ముందుకు సాగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం స్థలమివ్వకపోయినా సుచిత్ర ప్రాంతంలో స్కైవేను కొద్దిగా కుదించి పనులు చేపడతామని హామీఇచ్చారు. మంగళవారం బాలానగర్‌ ఫ్లైఓవర్‌ను దాని నిర్మాణంలో పాల్గొన్న కూలీల్లో ఒకరైన శివమ్మ చేతుల మీదుగా మంత్రి కేటీఆర్‌ ప్రారంభింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఒక్కో అడుగూ ముందుకుసాగుతున్నామని తెలిపారు. సుచిత్ర, జేబీఎస్‌ స్కైవేల నిర్మాణానికి ప్రణాళికలు, నిధులు సిద్ధంగా ఉన్నాయని.. కంటోన్మెంట్‌ ప్రాంతంలో రక్షణ రంగానికి సంబంధించిన భూములను సేకరించాల్సి ఉన్నదని మంత్రి గుర్తుచేశారు. భూములు ఇవ్వడంలో కేంద్రం సహాయ నిరాకరణ వల్ల ఈ రెండు స్కైవేల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నదని పేర్కొన్నారు. కేంద్రం భూమి ఇచ్చేందుకు ముందుకొస్తే వెంటనే స్కైవేల నిర్మాణం చేపడతామని, ఒకవేళ కేంద్రం స్థలం ఇవ్వకపోయినా సుచిత్ర చౌరస్తాలో స్కైవేను కొంత కుదించుకొని పనులు పూర్తిచేస్తామని చెప్పారు.

6వేల కోట్లతో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు
గత 40 ఏండ్లుగా బాలానగర్‌ ప్రాంతం తీవ్ర ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొంటున్నదని.. ఫ్లైఓవర్‌ ప్రారంభంతో చాలావరకు ఉపశమనం లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ముఖ్యంగా, కంటోన్మెంట్‌, కూకట్‌పల్లి, మెదక్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సుమారు రూ.30 వేల కోట్లతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ) చేపట్టామని.. అందులో మొదటి దశలో దాదాపు రూ.6 వేల కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్ల విస్తరణ తదితర పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాచుపల్లిలో రహదారి విస్తరణ కూడా త్వరలో చేపట్టి వేగంగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

ఫ్లైఓవర్‌కు జగ్జీవన్‌రామ్‌ పేరు
బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని పురస్కరించుకుని బాలానగర్‌ ఫైఓవర్‌కు ఆయన పేరు పెడుతున్నట్టు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీచేస్తామని తెలిపారు. తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెందరో అన్నట్టు.. ఏ నిర్మాణం జరిగినా అందులో కూలీల శ్రమ ఎంతో ఉంటుందని కేటీఆర్‌ చెప్పారు. కానీ, దానినెవరూ పట్టించుకోకుండా నేతలు మాత్రమే ప్రారంభోత్సవాలు చేస్తుంటారని అన్నారు. బాలానగర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణంలోనూ ఎందరో కూలీలు కష్టపడ్డారని.. వారి శ్రమను గౌరవిస్తూ నిర్మాణంలో రెండేండ్లపాటు కూలీగా భాగస్వామి అయిన శివమ్మ చేతులమీదుగా ఫ్లైఓవర్‌ను ప్రారంభించామని తెలిపారు. రూ.385 కోట్ల అంచనాకుగాను రూ.270 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయిందని, మిగిలిన మొత్తంతో రోడ్డు విస్తరణ పూర్తిచేస్తామని చెప్పారు. ఫతేనగర్‌ బ్రిడ్జి విస్తరణ కూడా త్వరలో చేపడతామన్నారు. అంతకుముందు ఫ్లైఓవర్‌ నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, సురభి వాణీదేవి, శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana