బుధవారం 03 జూన్ 2020
Telangana - May 08, 2020 , 02:23:43

రైతు మెడపై కరెంటు కత్తి!

రైతు మెడపై కరెంటు కత్తి!

  • పొలంలో మోటరుకు స్తంభంపై మీటరుకు కేంద్ర సర్కారు లంకె
  • ఉచిత విద్యుత్తుపై అనుచిత ఆంక్షలు
  • పిడుగుపాటుగా కేంద్ర విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు
  • ఉచితం బంద్‌.. కొత్తగా మీటర్లు.. చార్జీలు
  • నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా బిల్లు
  • నగదు బదిలీతో సబ్సిడీ కోత.. క్రాస్‌ సబ్సిడీకీ చెక్‌
  • 24 గంటల విద్యుత్‌ సరఫరాకు కోతపెట్టే చాన్స్‌
  • పాతకాలపు కరెంటు కష్టాలు పునరావృతం!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఊరందరిదీ ఒకదారి అయితే.. ఉలిపికట్టెది ఇంకోదారి అని సామెత.. దేశమంతా అభివృద్ధిపథంలో ముందుకుపోవాలని అంతా కృషిచేస్తుంటే.. విద్యుత్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొస్తున్న చట్ట సవరణ బిల్లు.. దేశంలోని రైతాంగానికి గొడ్డలిపెట్టుగా మారనున్నది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుష్కలమైన కరెంటుతో.. సమృద్ధిగా సాగునీటితో వ్యవసాయ ఫలాలను అందిపుచ్చుకొంటున్నఅన్నదాతలకు ఆఘాతంగా మారబోతున్నది. ఏడేండ్ల నాటి దుర్భర పరిస్థితులు పునరావృతమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ చట్టం-2003కు భారీగా సవరణలను ప్రతిపాదిస్తూ.. ఓ ముసాయిదాను ఏప్రిల్‌ 17న విడుదలచేసింది. దీనిపై అభ్యంతరా లు, సలహాలు, సూచనలను 21 రోజుల్లో తెలుపాలంటూ రాష్ర్టాలను, సంస్థలను కోరింది. ఈ ముసాయిదాను లోతుగా విశ్లేషిస్తున్నకొద్దీ రైతులపై తీవ్రంగా ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టమవుతున్నది. ఇకపై ఉచిత విద్యుత్‌ ఉండ దు. 24 గంటల సరఫరా కూడా ఉండకపోవచ్చు. మీటర్లు.. బిల్లులు మళ్లీ పుట్టుకొస్తాయి.. వెరసి రైతులు.. వ్యవసాయం కునారిల్లిపోయే పరిస్థితి తలెత్తుతుంది. 

మళ్లీ పొలాలకు మీటర్ల రాజ్యం 

తాజా సవరణల బిల్లుతో రైతులు మరోసారి విషవలయంలో చిక్కుకోబోతున్నారన్న ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. ఈ ముసాయిదా చట్టరూపం దాలిస్తే.. ప్రతి కనెక్షన్‌కీ మీటర్‌ పెట్టాల్సివస్తుంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం 24.4 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. చట్టం అమల్లోకి వస్తే ప్రతి కనెక్షన్‌కు త్రీఫేజ్‌ మీటర్‌ను బిగించాల్సి ఉంటుంది. ఒక్కో మీటర్‌ ఖరీదు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రం మొత్తంపై రూ.425 కోట్లకుపైగా భారం మీటర్లమీదనే పడుతుంది. ఇదంతా డిస్కంలే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక నష్టాల్లో ఉన్న విద్యుత్‌ సంస్థలు ఒక్కసారిగా ఇంత మొత్తాన్ని ఖర్చుచేయగలగడం అనుమానమే. ఏదోవిధంగా విద్యుత్‌ సంస్థలు ఈ మొత్తాన్ని ఖర్చుచేసినా.. తిరిగి రాబట్టుకోవడమెలా అన్నదానిపైనా స్పష్టతలేదు. ఇన్ని లక్షల కనెక్షన్లకు మీటర్లు బిగించాలంటే.. యుద్ధప్రాతిపదికన చేసినా కనీ సం ఆరు నెలలు పడుతుంది. మీటర్లు తేవడం.. పరీక్షించడం.. బిగించడం, ప్రతినెలా రీడింగ్‌, బిల్లు జనరేట్‌చేయడం శ్రమతో కూడుకున్నది.

అన్నదాతకు అశనిపాతం

ఇక్కడి నుంచే రైతులకు కరెంటు బిల్లు ప్రభా వం మొదలవుతుంది. మీటర్‌ బిగించి నెల తిరిగేసరికి బిల్లు కట్టాల్సి వస్తుంది. సాధారణంగా వ్యవసాయ బోరుకు 5 హెచ్‌పీ మోటర్‌ బిగిస్తారు. వానకాలం, యాసంగి పంటల కాలాన్ని పరిగణనలోకి తీసుకొంటే.. ఏడాదిలో ఎనిమిది నెలలపాటు బోరును రైతులు ఉపయోగిస్తారు. రోజుకు ఎనిమిది గంటలపాటు మోటర్‌ నడిచినా గంటకు 3.7 యూనిట్ల విద్యుత్‌ ఖర్చవుతుంది. ఈ లెక్కన రోజుకు 30 యూనిట్లు.. 8 నెలలు (240 రోజు లు) లెక్కేసుకొంటే 7వేల నుంచి 7,500 యూని ట్ల వరకు ఖర్చవుతుంది. యూనిట్‌కు రూ.6 అనుకొన్నా దాదాపు రూ.43 వేలకుపైగా బిల్లు వస్తుం ది. అంటే రైతులు నెలకు రూ.3వేల నుంచి రూ.4వేల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది రైతులపై మొదటి మోయలేని భారం.

నామమాత్రపు సబ్సిడీ?

కొత్త చట్టం ముసాయిదా ప్రకారం.. విద్యుత్‌ చార్జీలపై ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో సబ్సిడీని నేరుగా వినియోగదారుల ఖాతాల్లో జమచేస్తారు. అంటే ఇప్పుడు గ్యాస్‌ సబ్సిడీని నేరుగా మన ఖాతాల్లోనే జమచేస్తున్న విధానమన్నమాట. మనం గ్యాస్‌ సిలిండర్‌ను దాదాపు రూ.796 పెట్టి కొంటున్నాం. ప్రభుత్వం రూ. 206 సబ్సిడీని మన ఖాతాల్లో వేస్తున్నది. రూ. 590 మొత్తాన్ని మనం భరిస్తున్నాం. గ్యాస్‌రేటు ఎంత పెరిగినా.. ప్రభుత్వం మాత్రం ఆ మేరకు సబ్సిడీ మొత్తాన్ని పెంచదు. పెరిగిన మొత్తాన్ని వినియోగదారులు చెల్లించాల్సిందే. ఇప్పుడు విద్యుత్‌ చార్జీలపై సబ్సిడీ వ్యవహారంకూడా అలాగే ఉంటుంది. నామమాత్రంగానే సబ్సిడీ మొత్తం ఒకేసారి నిర్ధారితమై ఉంటుంది. దీనివల్ల రైతుకు ఎలాంటి లబ్ధి చేకూరదు. రాష్ట్రంలోని 24.4 లక్షల వ్యవసాయ కనెక్షన్ల నుంచి నెలకు రూ.వెయ్యి కోట్లు  బిల్లుల రూపంలో రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం ఇచ్చే సబ్సిడీ మొక్కుబడి మాత్రమే.


24 గంటల విద్యుత్‌పైనా సందిగ్ధమే

ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సాగుకు 24 గంటలపాటు విద్యుత్‌ను ఇస్తున్నది.  కొత్త చట్టం వస్తే.. 24 గంటల విద్యుత్‌ ఉండకపోవచ్చు. సరఫరా సమయాన్ని పరిమితంచేస్తే.. రైతులు గతంలో మాదిరిగా పొలాల్లోనే నిద్రపోవాల్సిన దుస్థితి తప్పకపోవచ్చు. ఇప్పుడు 24 గంటల విద్యుత్‌ అందుబాటులో ఉండటంతో రైతు అవసరమైనప్పుడు మోటర్‌ను నడుపుతున్నాడు. దీన్ని అనవసరమని భావించినా, అదనపు ఖర్చు అవుతుందనుకొ న్నా.. కరెంట్‌ సరఫరా సమయాన్ని కుదించవచ్చు. ఏ విధంగా చూసినా  కరెంటు కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొని, పిల్లా పాపలతో హాయిగా గడుపుతూ.. అనుకూలమైన సమయం లో మోటర్లను నడుపుతూ.. పుష్కలంగా పంటలు పండిస్తున్న రైతన్నలపై తాజా బిల్లులో పొందుపరిచిన అంశాలు పిడుగుపాటుగానే చెప్పుకోవాలి.

క్రాస్‌ సబ్సిడీ ఉండదు

వ్యవసాయానికి క్రాస్‌ సబ్సిడీ పద్ధతిలో ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు. కొత్త ముసాయిదా ప్రకారం ఇకపై క్రాస్‌ సబ్సిడీ ఉండదు. ఉదాహరణకు మన ఇంటికి వచ్చే బిల్లునే తీసుకొంటే.. యూనిట్‌కు రూ.2 చొప్పున లెక్కించి బిల్లు ఇస్తున్నారనుకొం దాం. వాస్తవంగా విద్యుత్‌ ఒక యూనిట్‌ ఉత్పత్తి.. పంపిణీ, సరఫరా చార్జీలు కలుపుకొంటే రూ.6 వరకు ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమలకు యూనిట్‌ రూ.8 వరకు వసూలుచేస్తారు. అంటే వాణిజ్య, పరిశ్రమల నుంచి వసూలుచేసిన మొత్తాన్ని గృహ వినియోగదారులకు మళ్లిస్తున్నారన్నమాట. దీన్నే క్రాస్‌ సబ్సిడీ అంటారు. కేంద్ర చట్టం అమల్లోకి వస్తే ఈ క్రాస్‌ సబ్సిడీకి అవకాశం ఉండదు.  ఎవరు ఎంత విద్యుత్‌ వినియోగిస్తే.. అంత బిల్లును చెల్లించాల్సిందే. గడువులోగా కట్టకపోతే కనెక్షన్‌ కట్‌చేస్తారు. ఒకవేళ అది పంటల కాలమైతే.. రైతు బాధ వర్ణనాతీతం. ఇటు బిల్లు కట్టలేక.. అటు కట్‌చేసిన కనెక్షన్‌ను తిరిగి పెట్టించుకోలేక.. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ ఉద్యోగులను పట్టుకోలేక.. రైతులు కనాకష్టం పడాల్సి వస్తుంది. 

ఏడేండ్లు వెనక్కి వెళ్లి చూస్తే..

మన మనసులో ఉన్న మార్మిక శక్తితో కాలచక్రాన్ని ఒక్కసారి ఏడేండ్లు వెనక్కి తిప్పిచూద్దాం. నాటి తెలంగాణ పల్లెల్లో ఏం కనిపిస్తుంది. వ్యవసాయానికి నీళ్లులేవు. బోర్లకు కరెంటు లేదు.. కరెంటు ఎప్పుడొస్తదో తెల్వక రేయింబవళ్లు పొలంలోనే బతుకులు వెళ్లదీయాల్సిన దుస్థితి..  కాలిపోయే బోర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు.. రాత్రిపూట కరెంటుషాక్‌లు.. పాముకాటు చావులు! ఎవరైనా రైతు యువకుడు పెండ్లి చేసుకొంటే.. ‘ఏమిరా సంసారం పెండ్లాంతో చేస్తవా.. కరెంటు మోటరుతో చేస్తవా’ అనేంతలా అపహాస్యమైన రైతు బతుకులు..

తెలంగాణ అవతరించిన తర్వాత..

2014 జూన్‌ 2 తెలంగాణ మళ్లీ పుట్టినరోజు.. సరిగ్గా ఆరు నెలలు తిరుగకుండానే కరెంటు కోతలకు కోత పడింది. రెండున్నరేండ్ల వ్యవధిలోనే వినూత్న మార్పు. 2017 డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ సరఫరా. విద్యుత్‌కోసం ఎదురుచూసుళ్లు లేవు. అర్ధరాత్రి కరెంటుషాక్‌లు లేవు.. ఆటోమెటిక్‌ మీటర్ల గోస లేదు. మోటర్లు కాలిపోయిందే లేదు. కాళేశ్వరం నీళ్లొచ్చినంక.. ప్రభుత్వం ఇస్తనన్నా కరెంటు స్విచ్‌వేయాల్సిన పనే లేకపాయె.. వద్దన్నా నీళ్లు.. ఇంటినిండా వడ్లు.. ఎవుసం పండుగైన దినాలివి..

బుసకొడుతున్న కేంద్ర చట్టం

రేపు.. ఈ మాట వింటేనే భయమేస్తున్నది. వణుకు పుడుతున్నది. ఢిల్లీలో ప్రభుత్వం ఓ కరెంటు చట్ట సవరణ బిల్లు తెస్తున్నది. ఇప్పుడు సుకూన్‌గా ఉన్న రైతు పానాన్ని మళ్లీ  బర్బాద్‌చేసే బిల్లు ఇది. ఈ బిల్లు చట్టమైందంటేనా.. మళ్లీ పాతరోజులే గతి.. కరెంటు కత కేంద్రం చేతుల్లోకి పోతుంది. అది చెప్పినట్టల్లా ఇనాలె. ఇప్పుడిస్తున్న కరెంటు ఉంటదో ఉండదో తెల్వదు. ప్రతి కనెక్షన్‌కూ మీటరు పెడ్తరు. కరెంటు కాల్చిన లెక్కలు జూస్తరు. సబ్సిడీ ఎంతిస్తరో తెల్వదు.. సబ్సిడీ ఇంతే ఇస్తామని ఫిక్స్‌చేసి .. రేట్లు పెంచుకొంటూ అడ్డగోలు బిల్లులు వేస్తే పైసలెక్కడినుంచి కడతరు? పొలంల పాము మాటేందో కానీ.. కేంద్ర చట్టం మాత్రం రైతును కాటేయడానికి బుస కొడుతున్నది.  


కేంద్రం తెస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్లు వందశాతం ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం. దానిని చాలా స్ట్రాంగ్‌గా వ్యతిరేకిస్తాం. ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను సమాధి చేస్తుంది. మన రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. ఈ బిల్లు వస్తే వాళ్లు చెప్పినట్లు  కరెంటు ఇవ్వాలి. పంపిణీ అంతా ప్రైవేట్‌కు అప్పగించే వ్యవస్థ వస్తుంది. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తరు. సబ్సిడీ ఇవ్వద్దంట! ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నం. లేదు 14 గంటలే ఇవ్వాలంటే మన రైతులకు ఇచ్చే కరెంటు కట్‌చేస్తరా? వ్యవసాయానికి చార్జీ వసూలు చేయాలని పెడతరా?  కొత్తగా వచ్చే చట్టం ప్రకారం వందశాతం మీటర్లు పెట్టాలి. ముక్కుపిండి బిల్లులు వసూలు చేయాలి. సబ్సిడీ ఇచ్చుకునేది ఉంటే నేరుగా రైతుకు ఇచ్చుకో అంటే.. ఇదేం పద్ధతో!

-  మంగళవారం నాటి మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు


  మన సర్కారు చేతుల్నే ఉండాలె

కేసీఆర్‌ సారు వచ్చినంక కరంటు మంచిగత్తాంది. యాడాదికి మూడొందలు కడితె మొత్తానికి మొత్తం ఉత్తగనే కరంటు పెట్టుకుంటన్నం. గిప్పుడు గీ కరంటు ఇంకొకల చేతులకు పోతె ఎట్ల? మన సర్కారు చేతుల్నే ఉండాలె

- అయిలయ్య, రైతు, ఎల్కతుర్తి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా


  ధైర్యంగా ఎవుసం చేస్తున్నం

ఇప్పుడు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న కరెంటుతో ధైర్యంగా ఎవుసం చేస్తున్నం. కరెంటు కేంద్ర ప్రభుత్వం చేతులకు పోయిందంటే ప్రైవేటోళ్లకు ఇస్తరు. మళ్లీ వ్యవసాయం ఆగం అయితది.

- కొమ్మిడి సమ్మిరెడ్డి, రైతు, ఎల్కతుర్తి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

 మేం ఊకోం

ఈ యేడు నీళ్లున్నందుకు మాకు సర్కారు ఇత్తున్న కరంటుతోటి మంచిగ పంటలు పండించుకుంటున్నం. గిప్పుడు కేంద్ర సర్కారు మళ్ల కిరకిరి చేసుడు మంచిది కాదు. కరంటు గిప్పట్లెక్కనే ఉండాలె. లేకుంటే రైతులందరం ఊకునుడులేదు.

- నరిగె రవి, రైతు, ఎల్కతుర్తి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా

 విద్యుత్‌ సవరణ బిల్లును అంగీకరించం

  • విద్యుత్‌ ఉద్యోగ, కార్మిక సంఘాల హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు - 2020ను తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా సవరణలను ప్రతిపాదించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వినియోగదారులు, రైతులకు తీరని నష్టం చేకూర్చే ఈ బిల్లును తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమంటున్నాయి. 

విద్యుత్‌ సంస్థల పాలిట మరణశాసనం

కేంద్రం నష్టాల పేరుతో విద్యుత్‌ సంస్థలను టాటా, రిలయెన్స్‌ వంటి బడా కార్పొరేట్లకు ధారాదత్తం చేయబోతున్నది. ఇప్పటికే ఒడిశాలో టాటా పవర్‌కు అప్పగించారు. ముంబై, నాగ్‌పూర్‌లో ప్రైవేటుసంస్థలు చేతులెత్తేశాయి. అయినా బుద్ధి తెచ్చుకోని కేంద్రం డిస్కమ్‌లను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నది. ఈ చట్టం విద్యుత్‌ సంస్థలపాలిట మరణశాసమయ్యే ప్రమాదం ఉంది. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నది. చట్టం అమల్లోకి వస్తే సబ్సీడీలు, రాయితీలకు ఆస్కారముండదు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్‌నివ్వలేం. లిఫ్ట్‌ ఇరిగేషన్‌.. ప్రాజెక్ట్‌ల నిర్వహణ భారమవుతుంది.

- ఎన్‌ శివాజీ, తెలంగాణ విద్యుత్‌ ఇంజినీర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు

 ధరలు భారీగా పెరుగుతాయి

  విద్యుత్‌ చార్జీలు ఆకాశాన్ని తాకే అవకాశముంది. ప్రైవేట్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున లాభాలు కలిగించేలా బిల్లులో సవరణలు ప్రతిపాదించారు. విద్యుత్‌ పంపిణీని ప్రాంచైజీ, సబ్‌లైసెన్స్‌గా విభజించి ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించనున్నారు. ముఖ్యం గా ఓపెన్‌ యాక్సెస్‌ నిర్ణయం ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల మనుగడను దెబ్బతీస్తుంది. కొత్త చట్టం రాకతో కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం కొనసాగనుంది. యూనిట్‌కు ఎంత వ్యయం అయితే అంతే చార్జిచేయాలని చట్టంలో ప్రతిపాదించారు. మన దగ్గర పేదలకు యూనిట్‌కు రూ. 1.40లకే విద్యుత్‌నందిస్తున్నాం. కొత్త చట్టం వస్తే పేదలు యూనిట్‌కు అదనంగా రూ. 5 చెల్లించాల్సి ఉంటుంది.

- పి. రత్నాకర్‌రావు, తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజినీర్స్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు

 టారిఫ్‌లు మారిపోతాయి

ఈ చట్ట సవరణతో విద్యుత్‌ టారిఫ్‌లు మారిపోతాయి. మన దగ్గర వినియోగాన్ని బట్టి 9 రకాల టారిఫ్‌లు అమలవుతున్నాయి. డిస్కమ్‌ల ఏఆర్‌ఆర్‌ను బట్టి, ఖర్చులు, రెవెన్యూను బట్టి ఈఆర్సీలు టారిఫ్‌లను నిర్ణయిస్తున్నాయి. ఇది ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులకు గురవుతున్నది. ఈ చట్టం రాకతో 4 టారిఫ్‌లే ఉండనున్నాయి. మిగిలిన వారుకొత్త టారిఫ్‌లోకి వస్తే తీవ్రంగా నష్టపోతారు. ఇక సబ్సిడీ మొత్తాన్ని గ్యాస్‌ సబ్సీడీ తరహాలో అకౌంట్లలో వేస్తామంటున్నారు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో అద్దెకుండే వాళ్లే అధికం. మీటర్లు యజమానుల పేర్లమీద ఉంటాయి. బిల్లులు చెల్లించేది కిరాయిదార్లయితే సబ్సీడీ యజమానుల అకౌంట్లల్లో ఎలా వేస్తారు.

- పీ అంజయ్య, విద్యుత్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసొసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


logo