సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 04:58:59

అభివృద్ధికి మోకాలడ్డు!

అభివృద్ధికి మోకాలడ్డు!

  • తెలంగాణపై కేంద్రప్రభుత్వం వివక్ష
  • విభజన చట్టం హామీలు తుంగలోకి
  • విద్యాలయాల్లేవ్‌.. రహదారుల్లేవ్‌
  • ఇవ్వాల్సిన వాటాకు కూడా కోతలు
  • పైగా అప్పులు చేసుకోవాలని హితవు
  • అన్ని రంగాల్లో రాష్ర్టానికి మొండిచేయి
  • జాతి ప్రయోజనాల్లో రాష్ట్రం చేయూత
  • ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కేంద్రం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రం ప్రవేశపెట్టిన అనేక చట్టాలకు మద్దతునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్ఫూర్తిని ప్రదర్శిస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ర్టాల హక్కులను హరించేలా వ్యవహరిస్తూ ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. కొత్త రాష్ట్రమైనా తన సొంత కాళ్లతో పరుగులు పెడుతుంటే ఆంక్షల సంకెళ్లతో కేంద్రం అడ్డు తగులుతున్నది. జీఎస్టీ, నోట్లరద్దు మొదలుకొని కేంద్రం తెచ్చిన చట్టాలతో రాష్ట్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా నష్టపోయింది. అయినా, దేశ శ్రేయస్సు కోసం ఆ నష్టాన్ని భరిస్తూ వచ్చింది. సొంత కష్టంతో ప్రగతివైపు పరుగులు తీస్తున్నది. ఆర్థికంగా కొత్త ఒరవడిని సృష్టిస్తూ సంపదను పెంచుకుంటున్నది. జాతీయ తలసరి ఆదాయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తెలంగాణకు కేంద్రం ఇస్తున్నది ఏంటి? అంటే కేవలం మొండిచేయి. అవును! రాష్ట్రం నుంచి కేంద్ర ఖజానాకు భారీగా సొమ్ము జమ అవుతున్నా, మనకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటాకు కోత పెడుతున్నది. దేశానికి ఆర్థిక ఇంజిన్‌లా ఉంటున్న తెలంగాణపై పక్షపాతం చూపుతున్నది. నీటిపారుదల రంగం, విద్య, ఆర్థికం, పారిశ్రామికరంగం, జాతీయ రహదారులు, రక్షణరంగ భూములు, విమానాశ్రయాలు, రైల్వేలు, సంస్కృతిని పరిరక్షించే అంశాలు ఇలా చాలా అంశాల్లో తెలంగాణకు కేంద్రం అన్యాయమే చేసింది. ఏ ఒక్క వినతిపైనా స్పందించిన దాఖలాలు లేవు. సీఎం కే చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధాని మోదీని కలిసి వినతిపత్రాలు సమర్పించినా, లేఖలు రాసినా కేంద్రం చేసింది శూన్యమే.

విభజన చట్టం హామీలు..

పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలను ఏడేైండ్లెనా కేంద్రం అమలుచేయలేదు. ఇందులో ప్రధానమైనది బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీ. పరిశ్రమను ఏర్పాటుచేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఐరన్‌ఓర్‌ను తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సర్వే కోసం 2018 ఫిబ్రవరి 6న రూ.2 కోట్లు కేటాయించారు. కావాల్సిన నీరు, భూమిపై కేంద్రం అధ్యయనం చేసింది. కానీ ఇంతవరకు స్పందనలేదు. ఒకవేళ కేంద్రం పెట్టబోమని స్పష్టంచేస్తే రాష్ట్రప్రభుత్వమే ఏర్పాటుచేస్తుందని సీఎం స్వయంగా ప్రకటించారు. కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు విభజనచట్టంలో స్పష్టమైన హామీ ఉన్నది. కానీ ఇంతవరకు హామీ అమలుచేయలేదు. దీనిపై అధ్యయనం కూడా చేయలేదు. కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని ఉమ్మడి రాష్ట్రంలోనే నినదించారు. ఆ తరువాత విభజన చట్టంలో పేర్కొనటంతో వరంగల్‌ జిల్లావాసులకు ఆశలు చిగురించాయి. కానీ రాష్ట్రం ఏర్పడి ఏడేైండ్లెనా ఇప్పటివరకు హామీ మాత్రం నెరవేరలేదు. విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో దీనిని ఏర్పాటుచేయడానికి రాష్ట్రప్రభుత్వం భూమిని కేటాయించింది. ఇంతవరకు భవనాల నిర్మాణాలకు కేంద్రం నిధులు విడుదల చేయటంలేదు. నిధులకోసం అనేకసార్లు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, అధికారులు విజ్ఞప్తిచేసినా స్పందన లేదు. బడ్జెట్‌లో రూ.కోటి కేటాయించినా, ఆ మొత్తాన్ని కూడా విడుదలచేయలేదు. తెలంగాణలో దాదాపు 12% గిరిజనులు ఉన్నారు. విభజన తర్వాత షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు. వీటి విభజనను పూర్తిచేయాలని కేంద్ర హోంశాఖను కోరినా చొరవ చూపలేదు.

జాతీయ రహదారుల్లేవ్‌..

రాష్ర్టానికి 3155 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరుచేస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ ఇప్పటికి 1388 కిలోమీటర్లు మాత్రమే మంజూరుచేశారు. ఇంకా 1767 కిలోమీటర్ల రోడ్లను మంజూరుచేయాల్సి ఉన్నది. రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి తెలంగాణలో జాతీయ రహదారులు చాలా తక్కువ. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషిచేసి జాతీయ రహదారుల మంజూరుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. దీంతో 3155 కిలోమీటర్లు మంజూరు చేస్తామని సూత్రప్రాయంగా తెలిపింది కానీ ఆచరణలో పెట్టలేదు. 334 కిలోమీటర్ల రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అంగీకరించినా, తర్వాత చేతులెత్తేసింది. అంతేకాదు.. రాష్ట్రంలోని జాతీయ రహదారి మరమ్మతులకు నిధులు కేటాయించడంలేదు.

విద్యాలయాలు ఎక్కడ?

ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఉన్నది. వీటి ఏర్పాటుపై అనేకసార్లు సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖలు రాశారు. పార్లమెంట్‌లో మన రాష్ట్ర ఎంపీలు మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో ఒక్కోజిల్లాకు రెండు మూడు నవోదయ విద్యాలయాలు స్థాపించారు. తెలంగాణకు కొత్తగా ఒక్కటి కూడా మంజూరుచేయలేదు. రాష్ట్రంలో గిరిజన జిల్లాలు అనేకం. కానీ, వేటిలోనూ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రానికి చేతులు రావటంలేదు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)ను తెలంగాణకు మంజూరు చేయాలని 2014 సెప్టెంబర్‌ 6న సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. ఆ తర్వాత వరుసగా 2018 జూన్‌ 15న, 2018 ఆగస్టు 4న, 2018 డిసెంబర్‌ 26న లేఖలు రాశారు. కేంద్రం పట్టించుకోలేదు. కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటుపై గతంలో కరీంనగర్‌ ఎంపీగా ఉన్న బీ వినోద్‌కుమార్‌ కేంద్ర మంత్రులను కలిసి విన్నవించారు. లేఖరాశారు. కానీ, మంజూరుచేయలేదు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఏర్పాటుచేయాలని కోరినా కదలికలేదు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధికారులు కేంద్రమంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు అనేకమార్లు ప్రస్తావించినా, నిలదీసినా కనీస స్పందనరాలేదు. కేంద్రం కుంటిసాకులు చెప్తూ జాతీయహోదాపై దాటవేత వైఖరి అవలంబిస్తున్నది.


logo