సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:45:59

విదేశీ కందులు మనకెందుకు?

విదేశీ కందులు మనకెందుకు?

  • ఆఫ్రికా నుంచి దిగుమతులను ఆపాలి
  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ రైతులకు నష్టం జరుగుతున్నదనీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్రికా దేశాల నుంచి కందులను దిగుమతి చేసుకోవడం ద్వారా స్థానిక రైతులకు ఇబ్బందిగా మారిందని, స్థానిక రైతులకు నష్టం కలిగించే పాలసీలపై కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. శనివారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌, మునిపల్లి, అందోలు మండలాల్లో పర్యటించిన హరీశ్‌రావు వివిధ అభివృద్ధి పనులను ప్రా రంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఇంపోర్ట్‌, ఎక్స్‌పోర్టు పాలసీతో తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆఫ్రికా దేశాల నుంచి కందులను దిగుమతి చేసుకొంటుండటంతో స్థానికం గా పండుతున్న కందులను రూ.4 వేలకు కూడా అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వమే రూ.5,850లకు కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించిందని గుర్తుచేశారు.

రైతులు పండించిన పత్తిని కొనుగోలుచేస్తున్న కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండి యా.. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధర పెరిగితే ఆ లాభం రైతులకు పంచాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. అన్నదాతల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. సాగు నీరు అందించడానికి రూ.10 వేల కోట్ల విద్యుత్‌ బిల్లులను తానే భరిస్తున్నదని ఉద్ఘాటించారు. ఎరువులు గ్రామాలకే పంపిస్తున్నామనీ, పెట్టుబడి సాయాన్ని అందించామని తెలిపారు. రూ.1200 కోట్లు వెచ్చించి ప్రతి రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించామన్నా రు. అనంతరం పుల్కల్‌ మండలం చౌటకూర్‌ శివారులో పత్తి చేనులో పనిచేస్తున్న రైతులతో మంత్రి ముచ్చటించారు. ఎరువులు అందుతున్నాయా?, రైతుబంధు పైసలు అందాయా? అని వారిని అడుగగా..  ఎరువులకు ఇబ్బందే లేదని, ప్రభుత్వం బాగా పనిచేస్తుందని రైతులు మంత్రికి వివరించారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, కలెక్టర్‌ హనుమంతరావు పాల్గొన్నారు. logo