గురువారం 28 మే 2020
Telangana - May 12, 2020 , 01:35:47

ఉద్యోగాలూ ఊడుతయ్‌!

ఉద్యోగాలూ ఊడుతయ్‌!

  • కొత్త ఉద్యోగాల ఊసే  ఉండదు
  • సబ్‌లైసెన్సీలుగా ప్రైవేటుకు ప్రవేశం
  • భారం తగ్గించుకునే ప్రయత్నాలు
  • జెన్‌కోకు కూడా సెగ తగిలే పరిస్థితి
  • కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లు ఎఫెక్ట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం -2020 బిల్లుతో రైతులు, గృహ వినియోగదారులే కాకుండా విద్యుత్‌ సంస్థల్లోని ఉద్యోగులపై కూడా దుష్ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిల్లులో పేర్కొన్న సబ్‌లైసెన్సీల విధానం ప్రైవేటుకు బాటలువేసి ఉద్యోగులకు ఉరిగా పరిణమించే అవకాశాలున్నాయని విద్యుత్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోల్డెన్‌ హ్యాండ్‌షేక్‌ లేదా స్వచ్ఛంద విరమణ పద్ధతుల్లో విద్యుత్‌రంగ ఉద్యోగులకు ఉద్వాసన పలుకవచ్చని అంటున్నారు. ప్రభుత్వ విద్యుత్‌రంగ సంస్థల్లో ఇక కొత్త ఉద్యోగాల మాటే మరిచిపోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌లో జరిగిన పరిణామాలను వారు ఉదహరిస్తున్నారు. సబ్‌లైసెన్సింగ్‌, ఫ్రాంచైజీల ద్వారా డిస్కంలను ప్రైవేటీకరించాలని కేంద్రం ముసాయిదా బిల్లులో ప్రతిపాదిస్తున్నది. సబ్‌లైసెన్సింగ్‌ ద్వారా రాష్ర్టాలు ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు ఒక ప్రైవేటు కంపెనీని ఎంచుకోవచ్చు. విద్యుత్‌, ఆర్థిక నష్టాలను తగ్గించుకునేందుకుగాను విద్యుత్‌ సరఫరా కోసం ప్రైవేటు కంపెనీలను నియమించుకోవచ్చని ఆ బిల్లు ప్రతిపాదిస్తున్నది. సాధారణంగా ప్రైవేటుసంస్థలు ఏ రంగంలోకైనా లాభార్జన ఉద్దేశంతోనే ప్రవేశిస్తాయి. కాబట్టి, అవి సబ్‌ లైసెన్సీలుగా మంచి ఆదాయం ఉండే ప్రాంతాలనే ఎంచుకుంటాయి. 

క్రమంగా ఉద్యోగులకు ఉద్వాసన

ప్రైవేటు సంస్థలు సబ్‌ లైసెన్స్‌లు తీసుకున్న ప్రాంతంలో.. ఉన్నతస్థాయి ఉద్యోగులను కచ్చితంగా తమవారినే నియమించుకొంటాయి. దీంతో డిస్కంలలోని ఉన్నతస్థాయి ఉద్యోగులు మరో ప్రాంతంలో సర్దుబాటుకావాలి. విద్యుత్‌ ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న స్థాయిలో ప్రైవేటు సంస్థలు జీతభత్యాలు ఇవ్వలేవు. అందువల్ల అవి ఉద్యోగుల సంఖ్యను కుదించుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో కిందిస్థాయి ఉద్యోగులను కూడా డిస్కంలో మరో ప్రాంతంలో సర్దుబాటు చేయకతప్పదు. ఓ వైపు ఆదాయం వచ్చే ప్రాంతాలను వదులుకొని, ఉద్యోగులను సర్దుబాటు చేయలేక, వారికి జీతభత్యాలు చెల్లించలేక డిస్కంలు ఆర్థిక భారంతో తల్లడిల్లే పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో డిస్కంలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రక్రియను ప్రారంభిస్తాయి. గోల్డెన్‌ హ్యాండ్‌షేక్‌, స్వచ్ఛంద విరమణ వంటి పథకాలను ప్రకటించే పరిస్థితులు తలెత్తుతాయని విద్యుత్‌రంగ నిపుణులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.

జెన్‌కోకూ తప్పని సెగ

రాష్ట్రంలో ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 50వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. వీరిలో 27,824 మంది ఉద్యోగులు కాగా, 22,637 మంది ఆర్టిజన్లు ఉన్నారు. వీరిలో డిస్కంల పరిధిలోనే ఎక్కువమంది పనిచేస్తున్నారు. ప్రతిపాదిత బిల్లు వల్ల ఉన్నతస్థాయి, మధ్యస్థాయి ఉద్యోగులు ఉద్వాసనకు గురికావచ్చని, ఆర్టిజాన్లు కిందిస్థాయి సిబ్బందిపై ఆ ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే విద్యుత్‌రంగంలో ఇకపై ఉద్యోగుల భర్తీ ఉండకపోవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ప్రైవేటు సంస్థలు ప్రవేశించిన తరువాత అవి తక్కువ జీతాలకే మానవ వనరులను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తాయని వారు వెల్లడించారు. మరోవైపు సబ్‌లైసెన్సీలు ఓపెన్‌ యాక్సెస్‌ కన్‌స్యూమర్స్‌ నిబంధనను అడ్డుపెట్టుకొని ఇతర సంస్థల నుంచి విద్యుత్‌ను కొనేందుకు ప్రయత్నిస్తే.. స్థానికంగా ఉన్న థర్మల్‌ విద్యుత్‌ను తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. అప్పుడు లాభాల స్థానంలో నష్టాలు తప్పవు.  ఆ ప్రభావం ఉద్యోగులపై పడుతుంది. నష్టాల కారణంగా జెన్‌కోలు జీతభత్యాలు చెల్లించలేక ఉద్యోగులను, కిందిస్థాయి సిబ్బందిని తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే ఇక్కడ కూడా గోల్డెన్‌ హ్యాండ్‌షేక్‌, స్వచ్ఛంద విరమణ పథకాలు ప్రవేశించే అవకాశం లేకపోలేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందువల్లనే తాము కేంద్రం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగ సంఘాలు స్పష్టంచేస్తున్నాయి.


logo