ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 02:37:49

ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం

ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం

  • ప్రతి ప్రాజెక్టుకూ కేంద్ర అనుమతి తప్పనిసరి!
  • ప్రాజెక్టులన్నింటిపైనా జల్‌శక్తి పట్టు కోసం యత్నం
  • కృష్ణాబోర్డు కాన్ఫరెన్స్‌లో కేంద్ర కార్యదర్శి సంకేతం
  • తెలుగురాష్ర్టాల ప్రాజెక్టుల వివరాలపై గుట్టుగా ఆరా

కొన్నిరోజులుగా తెలుగురాష్ర్టాల పరిధిలోని అన్ని ప్రాజెక్టుల వివరాలు, కృష్ణాబేసిన్‌లో నీటి లభ్యత, ఇతరత్రా సమగ్ర వివరాలను సేకరించే పనిలో కేంద్ర అధికారులు నిమగ్నమయ్యారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ కోసమే వివరాలు సేకరిస్తున్నారని భావిస్తుండగా.. కేంద్రం ఆలోచన మాత్రం మరోలా ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ర్టాల పరిధిలోని నీటి అంశాన్ని తన పరిధిలోకి తెచ్చుకునేందుకు బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర వివరాలను తెప్పించుకుంటున్నారని తెలిసింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నీళ్లు.. రాష్ట్ర జాబితాలోని అంశం. ఆర్టికల్‌ 246 ప్రకారం సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు తదితరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయి. కానీ, రాష్ట్ర పరిధిలో ఏ చిన్న ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినా కేంద్రం అనుమతి తప్పనిసరి చేసే దిశగా కేంద్ర జల్‌శక్తి అడుగులు వేస్తున్నది. ఇటీవల కృష్ణాబోర్డు అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జల్‌శక్తి కార్యదర్శి సిన్హా ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. రెండు రాష్ర్టాల పరస్పర ఫిర్యాదులను ఆసరాగా చేసుకొని తెలుగురాష్ర్టాల పరిధిలోని అన్ని ప్రాజెక్టుల సమాచారాన్నినేరుగా తెప్పించుకొంటున్నట్టు సమాచారం. 

సాధారణంగా రాష్ర్టాలు నిర్మించే సాగునీటి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోవు. భారీగా నిధులు అవసరమైతే, లేక అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడి ఉంటేనే కేంద్రాన్ని ఆశ్రయిస్తాయి. ప్రాజెక్టు కోసం కేంద్రం పరిధిలోని సంస్థల అనుమతులు కావాల్సి ఉంటే దరఖాస్తు చేసుకొంటాయి. పూర్తిగా సొంత నిధులతో, ఇతర రాష్ర్టాలతో సంబంధంలేని ప్రాజెక్టు అయితే కేంద్రం అనుమతి అవసరం లేదు. గోదావరి, కృష్ణా బేసిన్లలో ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులను నిర్మించాయి. ఉమ్మడి ఏపీలో వరద ఆధారంగా పలు ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. 

రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ పాత ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. కానీ, ఇకనుంచి తమనుంచి అనుమతి తీసుకున్నాకే నిర్మాణాన్ని చేపట్టాలనే దిశగా రాష్ర్టాలను కట్టడిచేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నది. రెండ్రోజుల క్రితం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి ఏకే సిన్హా ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు బోర్డులు కూడా సిద్ధం కావాలని సంకేతాలిచ్చినట్టు సమాచారం. పార్లమెంటులో పెట్టేందుకు రూపకల్పన చేస్తున్న వన్‌నేషన్‌-వన్‌ ట్రిబ్యునల్‌, నదీ పరీవాహకాల నిర్వహణ వంటి బిల్లులను కూడా పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. త్వరలో కృష్ణా బోర్డు పరిధిలోకి బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక కూడా రానున్నట్టు చెప్పారని తెలిసింది. 

పాత ప్రాజెక్టులపై గురి

రాయలసీమ ఎత్తిపోతలతోపాటు పోతిరెడ్డిపాడు విస్తరణ దరిమిలా తెలంగాణ ఫిర్యాదు చేయడం, ప్రతిగా ఏపీ కూడా తెలంగాణపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు పరిష్కారంగా అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్వహించేందుకు కేంద్ర జల్‌శక్తి కసరత్తు చేస్తున్నది. అయితే కొన్నిరోజులుగా తెలుగురాష్ర్టాల పరిధిలోని అన్ని ప్రాజెక్టుల వివరాలు, కృష్ణాబేసిన్‌లో     నీటి లభ్యత, ఇతరత్రా సమగ్ర వివరాలను సేకరించే పనిలో కేంద్ర అధికారులు నిమగ్నమయ్యారు. అపెక్స్‌ భేటీ కోసమే వివరాలు సేకరిస్తున్నారని అందరూ భావిస్తుండగా.. కేంద్రం ఆలోచన మాత్రం మరోలా ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ర్టాల పరిధిలోని నీటిఅంశాన్ని తన పరిధిలోకి తెచ్చుకునేందుకు బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర వివరాల్ని     తెప్పించుకుంటున్నదని తెలిసింది. ఏదైనా ఒక రాష్ర్టానికి సంబంధించి సమాచారం తీసుకోవాలన్నా, ఇవ్వాలన్నా రెండుబోర్డుల్లో సభ్యుడిగాఉన్న ఈఎన్సీతోనే సంప్రదింపులు జరుపాల్సి ఉండగా.. నేరుగా ఆయా ప్రాజెక్టుల అధికారుల నుంచి వివరాలు తీసుకోవడం అనుమానాలకు తావిస్తున్నది.


logo