గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:50:04

మరో లక్ష టన్నులు

మరో లక్ష టన్నులు
  • కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతి
  • సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి తోమర్‌కు
  • రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో కనీస మద్దతు ధరకు మరో లక్ష టన్నుల కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతిచ్చింది. రాష్ట్రంలో సాగునీటి వసతి పెరుగడంతో ఈ ఏడాది కందుల దిగుబడి గణనీయంగా పెరిగింది. దీంతో ప్రస్తుత సీజన్‌లో తొలివిడుత 47,500 టన్నుల కొనుగోలుకు అనుమతిచ్చిన కేంద్రం.. ఆ తర్వాత రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు రెండో విడుతలో మరో 4,500 టన్నుల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయినప్పటికీ మార్కెట్లకు భారీగా కందులు తరలిరావడంతో మరో 56,000 టన్నుల కొనుగోలుకు అనుమతివ్వాలని మంత్రి నిరంజన్‌రెడ్డి మరోసారి కేంద్రానికి లేఖ రాయడంతోపాటు రాష్ట్రంలో 2 లక్షల టన్నులకుపైగా కందుల దిగుబడి వస్తున్నందున కొనుగోలు కోటాను పెంచాలని ఢిల్లీలో జరిగిన ఐకార్‌ సదస్సులో కేంద్రానికి వివరించారు.


దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌తోమర్‌.. అదనపు కందుల కొనుగోలు కోసం లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ లేఖ రాయడంతో రాష్ట్రంలో గత కోటాకు అదనంగా మరో లక్ష టన్నుల కందుల కొనుగోలుకు కేంద్ర వ్యవసాయశాఖ అనుమతిచ్చింది. ఈ విషయంలో ముందుచూపుతో కేంద్రానికి లేఖరాసి అనుమతి లభించేలా చూసిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతుల తరఫున మంత్రి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర మంత్రి తోమర్‌కు ధన్యవాదాలు తెలిపారు.


logo
>>>>>>