బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 11:14:27

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: జాతీయ రైతు దినోత్సవం వేళ రైతులు రోడ్ల మీద ఉండటం బాధాకరమని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్లే ప్రపంచానికి అన్నంపెట్టే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎముకలు కొరికే చలిలోనూ 28 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఆందోళనల వల్ల ఇప్పటికే 41 మంది రైతులు చనిపోయారని వాపోయారు.

దేశంలోని 50 రైతుసంఘాలు, 14 మిలియన్ల ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు మద్దతుగా పోరాడుతు న్నారు. భారత్‌బంద్‌కు మద్దతుగా 25 కోట్ల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారని చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం దేశానికి మంచిదికాదన్నారు. దేశంలోని 55 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయ పౌరసమాజంపై ఉందన్నారు.

రైతుల డిమాండ్ మేరకు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవాలని కోరారు. పంటలకు మద్దతు ధర అంశాన్ని చట్టంలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. మద్దతు ధరకు పంటల కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వాలని సూచించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుచేయడం వంటి 10 డిమాండ్లను కేంద్రం భేషరతుగా అంగీకరించాలన్నారు.  


logo