ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 17:27:55

జాతి సంపదను పెంచే తెలంగాణకు చేయూతనివ్వండి : మంత్రి నిరంజన్‌రెడ్డి

జాతి సంపదను పెంచే తెలంగాణకు చేయూతనివ్వండి : మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌ : దేశంలో ఏ రైతు ఉత్పత్తి చేసినా అది జాతీయ సంపదకు తోడ్పాటు అవుతుంది. కావునా దీనికోసం కృషిచేస్తున్న తెలంగాణ రాష్ర్టానికి అదనపు నిధులు, సహకారం అందజేయాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ప్రగతి, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్ని రాష్ర్టాల వ్యవసాయశాఖ మంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. తెలంగాణలోని ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వేరుశనగ, వరి, మామిడి వంటి పంటలకు అనువుగా ఉన్న వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాలను కూడా అదనంగా చేర్చాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ... 

తెలంగాణ సర్కారు ఊతంతో రాష్ట్ర వ్యవసాయ స్వరూపం మారిపోయిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 501 రైతు ఉత్పత్తిదారుల సంఘాలున్నాయన్నారు. అన్ని మండలాల్లో ఒకటి లేదా రెండు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. 60.95 లక్షల మంది భూమి పట్టాదారులు ఉన్నారన్నారు. దీనిలో 89 శాతం మందికి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. పంటరుణాలు తీసుకున్న 41.61 లక్షల మంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందజేయడం జరిగిందన్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద లబ్దిపొందుతున్న 36.79 లక్షల మంది రైతుల కన్నా ఇది అధికమన్నారు. రాబోయే నాలుగేళ్లలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అన్ని రాష్ర్టాలకు వ్యవసాయరంగానికి కేంద్రం రూ.లక్ష కోట్లు వడ్డీ రాయితీపై రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా దీనిని రాష్ర్టాలకు గ్రాంటుగా ఇస్తే బాగుండేదన్నారు. 

ప్రాజెక్టుల పూర్తితో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ ఏడాది కేంద్రం దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం వరిధాన్యంలో 56 శాతం పైగా తెలంగాణ నుండే సేకరించడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో గత ఐదుళ్లుగా గోదాంల నిర్మాణం చేపట్టారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష కల్లాల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌ 400 నుంచి 1000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందుకుగాను స్థలాల గుర్తింపుకు రెవెన్యూశాఖకు ఆదేశాలిచ్చామన్నారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల నియంత్రణకు జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక మార్కెట్లను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించడం కోసం కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం, ప్యాక్‌హౌజ్‌ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. తెలంగాణలో ఇప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాలకు కేంద్ర సహాయాన్ని ఉపయోగించుకునేలా అవకాశం ఇవ్వాలన్నారు. కేంద్ర సహకార, వ్యవసాయ, స్వయంశక్తి గ్రూపులతో పాటు ఆసక్తిగల రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి నుండి రుణాలు అందజేయాలని విన్నవించారు.logo