సోమవారం 01 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:08:50

పలు దేశాల్లో సెల్ట్‌ కేంద్రాలు

పలు దేశాల్లో సెల్ట్‌ కేంద్రాలు

హైదరాబాద్‌  : హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇప్లూ)సేవలు ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపించాయి. ఇంతకాలం హైదరాబాద్‌, షిల్లాంగ్‌, లక్నో కేంద్రంగా సేవలందించిన విశ్వవిద్యాలయం ఇప్పుడు మన దేశ సరిహద్దులు దాటి శిక్షణనిస్తున్నది. అంతర్జాతీయంగా ఆంగ్లభాషలో తర్ఫీదునిచ్చేందుకు ఇప్లూ సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌(సెల్ట్స్‌)కేంద్రాలను నెలకొల్పుతున్నది. ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖచే ఇఫ్లూ గుర్తింపుపొందడం గమనార్హం. సెల్ట్స్‌ కేంద్రాల ద్వారా అక్కడి సివిల్‌ సర్వెంట్లు, వృత్తినిపుణులు, వ్యాపారులు, విద్యార్థులకు ఆంగ్లభాషలో తర్ఫీదునిస్తున్నది. ఇందుకు ఆయా దేశాల్లో  సెల్ట్స్‌ను ఏర్పాటు చేసింది. ఏషియన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా సౌత్‌ఈస్ట్‌ ఆసియా దేశాల్లో సెల్ట్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

ఈ కేంద్రాలు ఆసియా ఖండంలోని శ్రీలంక, వియత్నాం, లావోస్‌, కంబోడియా, మయన్మార్‌ దేశాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఇది వరకు ఐదు దేశాల్లో ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయగా, తాజాగా మరో ఐదు దేశాల్లో ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.  ఆఫ్రికా దేశాలైన సుడాన్‌, జబోటి, టోగో, మారిటానియా దేశాలకు సైతం విస్తరించనున్నాయి. ఈ దేశాల్లో సెల్ట్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర విదేశాంగశాఖ అనుమతివ్వాల్సి ఉంది. కేంద్రాల్లో చేరిన వారికి సమాచారప్రసారం(కమ్యూనికేషన్‌), సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణనివ్వడంతోపాటు, ప్రొఫిషియన్సీ అండ్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ప్రొగ్రాంల పేరుతో పలు డిప్లొమా కోర్సులను సైతం నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల ద్వారా ఆయా దేశాల్లోని ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. సర్టిఫికెట్‌ ఇన్‌ ఫ్రొఫిషియన్సీ ఇన్‌ ఇంగ్లిష్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ అఫీషియల్‌/ బిజినెస్‌ కమ్యూనికేషన్‌ రెండు ప్రొగ్రాంలను సెల్ట్‌ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నారు. వీటిని ఏర్పాటు చేసిన రెండేండ్ల తర్వాత అక్కడి ప్రభుత్వాలకే అప్పగిస్తున్నారు. రెండేండ్లు ముగిసిన తర్వాత సైతం కరికులం, బోధన తదితర అంశాలపై ఇప్లూ నిరంతరం పర్యవేక్షణ జరుపుతూ మార్గదర్శకత్వం వహిస్తున్నది.logo