బుధవారం 03 జూన్ 2020
Telangana - May 04, 2020 , 01:32:31

లాక్‌డౌన్‌పై కేంద్రం ఆరా

లాక్‌డౌన్‌పై కేంద్రం ఆరా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ పొడిగింపు, వలస కూలీలను స్వస్థలాలకు పంపించే అంశాలపై కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా ఆదివారం అన్ని రాష్ర్టాల సీఎస్‌లు, డీజీపీలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశంలోని జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లుగా వర్గీకరించిన నేపథ్యంలో ఆయా జోన్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాట్లాడారు. వలస కూలీల తరలింపుపై ఆరా తీశారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాజీవ్‌గౌబా.. సీఎస్‌లకు తెలిపారు. 

వేరేచోట చిక్కుకున్నవారికీ అనుమతి

లాక్‌డౌన్‌కు ముందు వివిధ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి చిక్కుకున్నవారు స్వస్థలాలకు వెళ్లడానికి కేంద్రం తాజాగా అనుమతించింది. పనిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు తమ స్వస్థలాలకు ఒకసారి వెళ్లి వస్తామంటే అనుమతించబోమని స్పష్టంచేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా అన్ని రాష్ర్టాల సీఎస్‌లకు ఆదేశాలు జారీచేశారు. 

నాన్‌ కొవిడ్‌ దవాఖానల్లో ప్రత్యేక చర్యలు

నాన్‌ కొవిడ్‌ దవాఖానల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ ఆదివారం మార్గదర్శకాలను జారీచేసింది. దవాఖానల్లో సాధారణ వైద్యసేవలు అందించాలని తెలిపింది. లక్షణాల్లేకుండానే కరోనా సోకే ప్రమాదం ఉండటంతో..  వైద్యులు, సిబ్బంది పీపీఈ కిట్లు వాడాలని చెప్పింది. 

రాష్ర్టానికి కేంద్ర ఆరోగ్య బృందం

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా రాష్ర్టాల ఆరోగ్య విభాగాలకు సాయం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆరోగ్య బృందాలను నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణకు కేటాయించిన బృం దంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు చెందిన ప్రొఫెసర్‌ జయంతిదాస్‌, జూనియర్‌ ఫ్యాకల్టీ దీపొయన్‌ బెనర్జీ ఉన్నారు.


logo