బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 16:33:26

కేంద్రం నిర్ణయాలు రైతుల పాలిట శాపాలు : మంత్రి జగదీష్ రెడ్డి

కేంద్రం నిర్ణయాలు రైతుల పాలిట శాపాలు : మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ : అనేక రైతు సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగలా మార్చాలని చూస్తుంటే కేంద్రంలోని మోదీ సర్కార్‌ దండగ చేయాలన్న కుట్రతో వ్యవహరిస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం నేరుగా రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని అన్నారు. కేంద్ర నిర్ణయాలన్నీ రైతాంగం పట్ల గొడ్డలి పెట్టు లాంటివని చెప్పారు. జిల్లాలోని చిట్యాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి అతిథిగా హాజరయ్యారు.

మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జడల ఆదిమల్లయ్య, వైస్ చైర్మన్‌గా కొండూరి శంకర్‌తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడాతూ..తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను మోదీ దెబ్బ కొట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టడానికి కేంద్రం పెద్ద కుట్ర చేస్తుందని చెప్పారు. మోదీ సిద్ధాంతాలతో రైతులు వ్యవసాయాన్ని వదులుకునే పరిస్థితి దాపురిస్తోందన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంటే.. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తేవడం దుర్మార్గమని విమర్శించారు.


ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్రంలో వ్యవసాయాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే పని కొనసాగుతుందని చెప్పారు. వ్యవసాయ మార్కెట్లు కూడా రైతులకు సేవలు అందించడంలో మరింత కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లల్లో రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.