గురువారం 16 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:25:06

సిమెంటు ధరలు తగ్గించాలి

సిమెంటు ధరలు తగ్గించాలి

  • నిర్మాణరంగం వృద్ధి కోసం ధర తగ్గింపు తప్పదు
  • సిమెంట్‌ కంపెనీలకు మంత్రి కేటీఆర్‌ సూచన
  • వారంరోజుల్లో నిర్ణయం చెప్తామన్న ప్రతినిధులు
  • ‘డబుల్‌' ఇండ్లకు 2016 నాటి ధరకే సిమెంట్‌ 
  • హుజూర్‌నగర్‌లో ఎన్‌ఏసీ శిక్షణ కేంద్రం ఏర్పాటు
  • సిమెంట్‌ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, వేముల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వృద్ధి కొనసాగాలంటే సిమెంట్‌ రేట్లు తగ్గాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. లాక్‌డౌన్‌ అనంతరం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సిమెంట్‌ బస్తా ధరను తగ్గించాలని ఆ కంపెనీల ప్రతినిధులను కోరారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు గురువారం మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రగతిభవన్‌లో సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరోనా సంక్షోభం వల్ల మిగతా రంగాల మాదిరిగానే రియల్‌ఎస్టేట్‌ రంగం కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి నిర్మాణ రంగానికి చేయూతనివ్వడంకోసం ధరలు తగ్గించడం అనివార్యమని మంత్రులు పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్‌ఎస్టేట్‌ రంగంపై అదనపు భారం పడితే అది అంతిమంగా సామాన్య ప్రజలపైన, వినియోగదారులపైన పడే అవకాశం ఉన్నదన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో కొనసాగుతూ వస్తున్న నిర్మాణరంగ అభివృద్ధి భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని తెలిపారు. అధికశాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో నిర్మాణరంగం కూడా ఒకటని.. ఈ రంగం ఒడిదుడుకులకు లోనైతే అంతిమంగా సిమెంట్‌ కంపెనీలపైనా ప్రభావం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. సిమెంట్‌ ధరలు తగ్గించాలని ప్రభుత్వం చేసిన సూచనకు కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. అంతర్గతంగా మాట్లాడుకొని ఏ మేరకు ధర తగ్గించేది వచ్చే వారం లోపు ప్రభుత్వానికి తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు  మంత్రులకు తెలిపారు. అయితే, డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మరో మూడేండ్లపాటు బస్తా రూ.230 చొప్పున ఇచ్చేందుకు సిమెంట్‌ కంపెనీలు గురువారంనాటి సమావేశంలో అంగీకరించాయి. 2016 నుంచి సిమెంట్‌ కంపెనీలు ఇదే ధరకు సిమెంట్‌ను సరఫరాచేస్తున్న సంగతి తెలిసిందే. 

హుజూర్‌నగర్‌లో ఎన్‌ఏసీ సెంటర్‌

సిమెంట్‌ కంపెనీలు పెద్ద ఎత్తున ఉన్న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో జాతీయ నిర్మాణ అకాడమీ (ఎన్‌ఏసీ) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో అక్కడి యువతకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి వీలుగా ఎన్‌ఏసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీచేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. తమకు అవసరమైన సిబ్బందిని ఈ శిక్షణ కేంద్రం నుంచి తీసుకొంటామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణ కేంద్రానికి అన్నివిధాలా అండగా ఉంటామన్నా రు. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పట్ల ఈ సమావేశానికి హాజరైన హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే సైదిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌తోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 


logo