సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 02:01:44

ఆగమేఘాల మీద ధరణి

ఆగమేఘాల మీద ధరణి

  • తాసిల్దార్‌ కార్యాలయాల్లో సీసీటీవీలు, ప్రింటర్లు 
  • త్వరలో రెవెన్యూ అధికారులకు ‘రిజిస్ట్రేషన్‌' శిక్షణ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దసరాకు ధరణి పోర్టల్‌ను ప్రారంభించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. తాసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ జరుగనున్న నేపథ్యంలో అందుకనుగుణం గా వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ధరణి శిక్షణలో పాల్గొనే సిబ్బంది వివరాలను సేకరించారు. తాసిల్దార్‌, డిప్యూటీ తాసిల్దార్‌తోపాటు సీనియర్‌ అసిస్టెంట్‌, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌కు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. 

అవసరమైతే అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఇప్పటికే కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్నా యి. అవసరమైనచోట అదనపు కంప్యూటర్లు, ప్రింటర్లను ఏర్పాటుచేస్తున్నారు. ధరణిలో వేగం గా లావాదేవీలు జరుగాల్సిన దృష్ట్యా ఇంటర్నెట్‌ వేగాన్ని 20 ఎంబీపీఎస్‌కు పెంచనున్నట్టు సమాచారం. అవకతవకలకు ఆస్కారం లేకుండా తాసిల్దార్‌ కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలను బిగించనున్నట్టు తెలిసింది. దీంతో పారదర్శకత పెరుగడంతోపాటు భద్రత కూడా ఉంటుందని చెప్తున్నారు.

 డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్స్‌ ఇచ్చే అం శంపైనా అధికారులు కసరత్తుచేస్తున్నారు. ప్రస్తు తం మండల కార్యాలయాల్లో ధరణి కోసం ఉన్న ఆపరేటర్లు కాంట్రాక్ట్‌ ఏజెన్సీకి చెందినవారని, వారికి బదులు ఆఫీస్‌ సిబ్బందిలో ఒకరికి రిజిస్ట్రేషన్‌, ధరణి నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని  ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి కోరారు.

వికారాబాద్‌లో  పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం

 వికారాబాద్‌ జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేసిన ధరణి విజయవంతమైంది. 2018 మే నుంచి జిల్లాలోని పరిగి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, నవాబుపేట్‌ మండల తాసిల్దార్‌ కార్యాలయాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి.. ధరణి పోర్టల్‌ ద్వారా పారదర్శకంగా సేవలందిస్తున్నారు. మ్యుటేషన్లు, సక్సేషన్లు, రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్‌ ద్వారానే జరుగుతున్నాయి. ఈసీలతోపాటు ఇతర సర్టిఫైడ్‌ సర్టిఫికెట్లన్నీ ధరణి ద్వారా నేరుగా పొందుతున్నారు. పాస్‌పుస్తకాల్లో తప్పుగా ముద్రించిన పట్టాదార్‌ పేర్లను, విస్తీర్ణంలోని తప్పులను కూడా ధరణి ద్వారా సవరించారు. 

ఉదాహరణకు.. పూడూర్‌ మండలం ఎన్కెపల్లి గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్‌ 99లో వాస్తవానికి ఎనిమిదెకరాల భూమి ఉన్నది. కానీ, 170 ఎకరాలున్నట్టు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీచేశారు. వాస్తవంగా సర్వేనంబర్‌లో ఉన్నదానికంటే 162 ఎకరాలు ఎక్కువున్నట్టు పట్టాలిచ్చారు. అదే పంచాయతీలో సర్వే నంబర్‌ 100లో 2.23 ఎకరాలు ఉండగా, 14 ఎకరాలకు పట్టాలిచ్చారు. కంప్యూటర్‌ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో పొందుపర్చే సమయంలో చేసిన తప్పులు, వీఆర్వోలు బోగస్‌ లబ్ధిదారులను చేర్చడంతో తలెత్తిన ఏండ్లనాటి రీ-సెటిల్‌మెంట్‌ రికార్డు (ఆర్‌ఎస్‌ఆర్‌) సమస్యలకు ధరణి పరిష్కారం చూపింది.

 ఎక్కువ విస్తీర్ణమున్నట్టు పట్టాలు జారీఅయిన సర్వే నంబర్‌లో ఎవరెవరి పేరిట ఎంతెంత భూమి ఉన్నదీ.. తదితర పూర్తి వివరాలను సేకరించిన అధికారులు సమస్యలను పరిష్కరించారు. జిల్లాలోని పూడూర్‌ మండలంతోపాటు మర్పల్లి, దోమ, బషీరాబాద్‌, కోట్‌పల్లి మండలాల్లో ఉన్న ఈ సమస్యలకు పరిష్కారం చూపారు. ‘ధరణితో అవకతవకలకు వీలుండ దు. పారదర్శకంగా సేవలందుతాయి. సమయం, డబ్బు ఆదా అవుతుంది’ అని అదనపుకలెక్టర్‌ సబావత్‌ మోతీలాల్‌ తెలిపారు.


logo