గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 00:59:02

కరోనాపై సీసీఎంబీ పోరు

కరోనాపై సీసీఎంబీ పోరు

-అత్యాధునిక పరికరాలు, సిబ్బందితో సర్వసన్నద్ధం

-సోమవారం నుంచి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు

-‘నమస్తే తెలంగాణతో’ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జీవకణ పరిశోధనల్లో ఎంతో ఖ్యాతి పొంది దేశానికే తలమానికంగా నిలిచిన హైదరాబాద్‌ సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ) కరోనా మహమ్మారిపై పోరాటానికి సిద్ధమైంది. ఇందుకు అవసరమైన పరికరాలను, సిబ్బందిని సిద్ధంచేసుకొని సోమవారం నుంచి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. జీవశాస్త్ర (లైఫ్‌సైన్సెస్‌) పరిశోధనల్లో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన సీసీఎంబీని కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించుకొనేందుకు అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించారు.

కేంద్రం అనుమతే తరువాయి

ఈ పరీక్షల నిర్వహణకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని, కేంద్రం నుంచి అనుమతి రాగానే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే వైద్యశాఖతోపాటు గాంధీ, ఉస్మానియా దవాఖానల ఉన్నతాధికారులతో చర్చలు జరిపామని, పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా 20 మంది నిపుణులను రంగంలోకి దింపనున్నామని చెప్పారు. ఈ పరీక్షల కోసం సిద్ధంచేసిన అత్యాధునిక ఆర్టీపీసీఆర్‌ (రియల్‌ టైమ్‌ పాలిమెరెస్‌ చైన్‌ రియాక్షన్‌) పరికరాలను సిద్ధంచేశామని, వీటిద్వారా కేవలం రెండుగంటల వ్యవధిలోనే 100 మందికి పరీక్షలు నిర్వహించగలుగుతామని, ఈ విధంగా రోజుకు 1,000 మందికిపైగా పరీక్షలు నిర్వహించవచ్చని వివరించారు. హైదరాబాద్‌లోని తార్నాకలో 1977లో ఏర్పాటైన సీసీఎంబీ.. జీవశాస్ర్తానికి సంబంధించిన పరిశోధనల్లో అద్భుతాలను సాధించి ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. జీవకణాల సృష్టితోపాటు వివిధ రకాల జీవజాతులు, మనుషుల జన్యుక్రమాలను గుర్తించడం, మూలాలను కనుక్కోవడంలో సీసీఎంబీ కీలకపాత్ర పోషిస్తున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సీసీఎంబీ సేవలను వినియోగించుకొనేందుకు చొరవ తీసుకోవడాన్ని పలువురు అభినందిస్తున్నారు.


logo