మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:12:54

వచ్చే ఏడాదే వ్యాక్సిన్‌

వచ్చే ఏడాదే వ్యాక్సిన్‌

  • కనీసం మరో ఏడెనిమిది నెలలు పట్టొచ్చు 
  • సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ఈ ఏడాది రావడం కష్టమేనని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌-19 టీకా కోసం అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయని, అవన్నీ వివిధదశల్లో ఉన్నాయని తెలిపారు.  ఇదే వేగంతో, అత్యంత కచ్చితత్వంతో జరిగితే మరో ఏడెనెమిది నెలల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ‘జబ్బు పడ్డ వ్యక్తికి ట్యాబ్లెట్‌ వేసినట్టు.. వ్యాక్సిన్‌ ఇచ్చి తగ్గిందా? లేదా? అని చూసేందుకు ఇదేమీ  డ్రగ్‌ కాదు. వైరస్‌ మన శరీరంలోకి వస్తే పోరాడేందుకు కావాల్సిన ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయగలిగే వ్యాక్సిన్‌. కాబ్టటి భారీఎత్తున క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగాలి’ అని పేర్కొన్నారు. అన్ని వయసుల వారిని, వివిధ రకాల వ్యాధులు ఉన్నవారిని దృష్టిలో ఉంచుకోవాల్సి ఉన్నదన్నారు. 

అందరికీ పనికొచ్చే టీకాను అందుబాటులోకి తేవడం పెద్ద సవాల్‌ అని చెప్పారు. సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ తయారీకి కొన్నేండ్ల సమయం పడుతుందని, కరోనా విషయంలో అంత సమ యం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఆగస్టు 15 నాటికి మార్కెట్‌లోకి తేవాలని ఐసీఎంఆర్‌ గడువు నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భంలో రాకేశ్‌ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 


logo